తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అందించింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తాజాగా మహిళల విద్య, ఉపాధిపై తమ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిందని మంత్రి సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ మేరకు తాజాగా బీఆర్‌కే భవన్ లో సెర్ఫ్ డైరెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం జరిపారు.
మహిళలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతి మహిళ అక్షరాస్యురాలిగా ఉండటమే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళలకు అక్షరజ్ఞానంతో పాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు మహిళా సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 8,227 గ్రామ మహిళా సంఘ భవనాలకు అనుమతులు మంజూరు అయ్యాయని అందులో 5,239 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రస్తుతం 5 వేలకుపైగా వీఓ భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది మరో ఐదు వేల భవనాలు నిర్మిస్తామన్నారు.

అలాగే అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 6.5 లక్షల మహిళలకు అక్షరజ్ఞానం కల్పించామని వెల్లడించారు. త్వరలోనే మరో 6 లక్షల మందికి గ్రామ స్థాయిలోనే విద్యాబోధన చేపడతామని మంత్రి సీతక్క వివరించారు. ఇక రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘం ఆర్థిక క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు టీనేజ్ బాలికల కోసం స్నేహా సమ్మర్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications