ఏఐ ముప్పును శాస్త్రవేత్తలు తగ్గించి చూపుతున్నారా ? గాడ్ ఫాదర్ షాకింగ్..!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సంస్థలు, ఉద్యోగులు, ప్రభుత్వాలు ఇలా ప్రతీ ఒక్కరూ ఏఐ వల్ల ప్రయోజనాలు, నష్టాల గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఏఐ దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉంది. దీని వల్ల ఉద్యోగాలకు ఏర్పడుతున్న ముప్పు గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. కానీ అసలు ఏఐ వల్ల ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదాల గురించి మాత్రం శాస్తవేత్తలు తగ్గించి చూపుతున్నట్లు ఏఐ గాడ్ ఫాదర్ గా పేరున్న జాఫ్రే హింటన్ వెల్లడించారు.
వేగంగా సాగుతున్న ఏఐ అభివృద్ధి వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ప్రధాన టెక్ కంపెనీలు తక్కువగా అంచనా వేస్తున్నాయని హింటన్ తెలిపారు. వన్ డెసిషన్ పాడ్‌కాస్ట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది కార్పొరేట్ నాయకులకు ప్రమాదాల గురించి తెలుసు కానీ అర్థవంతమైన చర్య తీసుకోకుండా తప్పించుకుంటున్నారని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలలోని చాలా మంది వ్యక్తులు ఏఐ వల్ల ఎదురయ్యే ప్రమాదంపై బహిరంగంగా మాట్లాడటం లేదని తెలిపారు. ఉదాహరణకు డీప్ మైండ్ కు చెందిన డెమిస్ వంటి వ్యక్తులు నిజంగా నష్టాలను అర్థం చేసుకుంటున్నారని, దాని గురించి నిజంగా ఏదైనా చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

ఏఐ నెట్ వర్క్ లపై సంయుక్తంగా నోబెల్ బహుమతి గ్రహీత కూడా అయిన హింటన్.. దశాబ్దం పాటు చేసిన అధ్యయనాల ఫలితంగా ఇప్పుడు కృత్రిమ మేథ ఈ స్దాయిలో దూసుకుపోతోంది. అయినా ఆయన ఇప్పుడు అధునాతన ఏఐ వ్యవస్థలు మరింత తెలివిగా మారుతున్నాయని, మానవులు పూర్తిగా అర్థం చేసుకోలేని విధంగా నేర్చుకుంటున్నాయని హెచ్చరించారు. ఇప్పుడు అవి పనిచేయడం ప్రారంభించిన రేటు ఎవరూ ఊహించని విధంగా ఉందన్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఈ ప్రమాదాలను గుర్తించలేకపోయినందుకు చింతిస్తున్నట్లు హింటన్ అంగీకరించారు. ఏఐ తో ప్రమాదాలు ఎలా ఉంటాయో తాను ముందే గ్రహించాల్సిందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications