కోటి రూపాయలు ఇస్తా- బెంగళూరుకు ప్రాణం పొయ్యండి
ఈజీమై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిత్తి బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), శాటిలైట్ డేటాను ఉపయోగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ను మెరుగుపర్చడానికి అధికారులు, వాహనదారులు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. బెంగళూరులో రాత్రి వేళ 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి రెండు గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందని ప్రశాంత్ పిత్తి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ లైట్లు లేని ప్రదేశంలో అక్షరాలా గంటన్నర పాటు చిక్కుకుపోయానని తెలిపారు.

''గూగుల్ మ్యాప్స్, AI ద్వారా బెంగళూరులోని ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించడానికి కోటి రూపాయలను విరాళంగా ఇస్తాను. శనివారం రాత్రి బెంగళూరు ట్రాఫిక్‌లో 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 2:15 నిమిషాలు పట్టింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక చోట ట్రాఫిక్ లైట్లు కూడా లేవు. పోలీసులు కూడా అందుబాటులో లేరు.. 100 నిమిషాలు అక్కడే ఉండిపోయాను'' అని పిత్తి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ సమస్య గురించి ఎవరికీ ఫిర్యాదు చేయాలనుకోవట్లేదని, దాన్ని పరిష్కరించాలనుకుంటున్నానని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించిన గూగుల్ మ్యాప్స్ రోడ్ మేనేజ్‌మెంట్ ఇన్ సైట్స్ ఫీచర్ నుండి సేకరించిన డేటాను తన ప్రాజెక్ట్‌లో ఉపయోగిస్తామని పిత్తి తెలిపారు.
బిగ్ క్వెరీ ఫార్మాట్‌లో ఉన్న ఈ డేటాను శాటిలైట్ చిత్రాలతో కలిపి బెంగళూరులోని ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించవచ్చని ఆయన అన్నారు. గూగుల్ డేటా, శాటిలైట్ ఫొటోలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలను సులభంగా గుర్తించవచ్చని, ట్రాఫిక్ విభాగం అధికారులు వాటిపై దృష్టి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
తాను ప్రకటించిన కోటి రూపాయల విరాళం మొత్తాన్ని మెషిన్ లెర్నింగ్/ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్లను నియమించుకోవడం, గూగుల్ మ్యాప్స్ API, శాటిలైట్ ఫొటోలు, జీపీయూ, ఫీల్డ్ ట్రయల్స్ కోసం వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఓపెన్-సోర్స్ చేయడం ద్వారా ఇతర నగరాలు కూడా లబ్ధి పొందేలా చూడవచ్చని పిత్తి పేర్కొన్నారు.
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP), బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) తమ డేటా ఫీడ్‌లపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చని, సమస్యలను పరిష్కరించడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నియమిస్తే వెంటనే తాను ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తానని ప్రశాంత్ పిత్తి పేర్కొన్నారు.
తాను చేసిన ట్వీట్ ను యూజర్లు రీట్వీట్ చేయాలని పిత్తి కోరారు. బెంగళూరు ట్రాఫిక్ ఆఫీస్, BBMP లేదా ట్రాఫిక్ కమిషనర్ కార్యాలయంలో తెలిసిన వారికి దీన్ని ట్యాగ్ చేయాలని, తన ఆలోచన సరైన వ్యక్తికి చేరేలా చూడాలని కోరారు. మెషిన్ లెర్నింగ్/AI నిపుణులు ఈ సమస్యను పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే కామెంట్ చేయాలనీ సూచించారు.
బెంగళూరు ట్రాఫిక్ వల్ల తమ విలువైన సమయం సమయం వృథా అవుతోందని బాధపడుతున్న ప్రయాణికులు, వాహనదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రశాంత్ పిత్తి విజ్ఞప్తి చేశారు. బెంగళూరు.. దేశ సాంకేతికరంగానికి ఓ ఉజ్వల భవిష్యత్తు. ఇక్కడ పనిచేసే ప్రజలకు మంచి సౌకర్యాలు ఉండాలి..'' అని అన్నారు.












Click it and Unblock the Notifications