కాసేపట్లో భూమిని తాకనున్న సౌర తుఫాను.. 1 ఏళ్ల సౌర చక్రంలో కొత్త అలజడి..
విశ్వాంతరాళంలో ఒక ఊహించని రోదసి సంచలనం చోటుచేసుకుంది. విశ్వానికి కాంతిని పంచే సూర్యుడి ఉపరితలంపై శక్తివంతమైన ప్లాస్మా జ్వాలలు విస్ఫోటనం చెందాయి. ఈ దాటికి సూర్యుడి నుంచి భారీ ఎత్తున విడుదలైన విద్యుదావేశ కణాలు అంతరిక్షంలో ప్రయాణిస్తూ, నేరుగా మన భూమి దిశగా పయనిస్తున్నాయి. ఈ పరిణామం కారణంగా సోమవారం (ఆగస్టు 17న) భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఒక సౌర తుఫాను తాకనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సూర్యుడి ఉపరితలంపై ఉన్న ఒక భారీ అయస్కాంత పొర ఆగస్టు 14వ తేదీన అకస్మాత్తుగా బద్దలైంది. దీంతో అతిపెద్ద 'కరోనల్ మాస్ ఎజెక్షన్' సంభవించి, భారీ స్థాయిలో విద్యుదావేశంతో కూడిన ప్లాస్మా మేఘాలు అంతరిక్షంలోకి ఎగిసిపడ్డాయి. ఈ ప్లాస్మా ద్రవ్యరాశి పయనాన్ని అంతరిక్ష వాతావరణ పరిశోధక సంస్థలు నిరంతరం ట్రాక్ చేశాయి. అంతరిక్షంలో వేగంగా పయనిస్తున్న ఈ ప్లాస్మా కణాలు సోమవారం నాటికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశముందని అంచనా వేశాయి.

మానవాళికి ముప్పు లేదు.. ఆర్కిటిక్ నింగిలో మెరిసే రంగుల విచిత్రం!
ఈ సౌర తుఫాను 'G1-క్లాస్' వర్గానికి చెందినదని, ఇది అత్యంత తక్కువ తీవ్రత కలిగిన సాధారణ రకమని పరిశోధకులు స్పష్టం చేశారు. దీనివల్ల సాధారణ ప్రజల రోజువారీ జీవితానికి లేదా నిత్యం వాడే సాంకేతికతకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, ఉత్తర అమెరికా, యూరప్‌లోని దృవ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. భూమి అయస్కాంత రక్షణ కవచంతో ఈ కణాలు ఢీకొన్నప్పుడు నింగిలో 'అరోరా' అని పిలిచే అత్యంత మనోహరమైన, సుందరమైన రంగుల కాంతులు వెలుగులీననున్నాయి.
సౌర చక్రంలో పెరుగుతున్న ఉధృతి.. శాస్త్రవేత్తల నిరంతర నిఘా!
ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల సౌర చక్రంలో అత్యంత చురుకైన దశ గుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా సూర్యుడిపై వరుసగా ఆగ్ని జ్వాలలు, ప్లాస్మా విస్ఫోటనాలు జరుగుతున్నాయి. ఉపగ్రహాలు, రేడియో కమ్యూనికేషన్, నావిగేషన్ సిస్టమ్‌లపై అంతరిక్ష వాతావరణం ఏవిధంగా ప్రభావం చూపుతుందో లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ చిన్న తరహా సౌర తుఫాను శాస్త్రవేత్తలకు ఒక గొప్ప అవకాశంగా మారింది.














Click it and Unblock the Notifications