AI Psychosis: ఉద్యోగుల్లో కొత్త మానసిక రుగ్మత? మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో వార్నింగ్..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ దూకుడు కొనసాగుతోంది. రంగాలతో సంబంధం లేకుండా ప్రతీ చోటా ఏఐ మాటే వినిపిస్తోంది. ఏఐ దెబ్బకు లక్షల సంఖ్యలో కంపెనీలు వణుకుతున్నాయి. అంతకంటే ఎక్కువగా అందులో పనిచేసే ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కంపెనీలు ఏఐని తెచ్చుకుని ఉద్యోగుల్ని ఎలా సాగనంపాలా అని ఆలోచిస్తుంటే.. ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియక టెన్షన్లో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో మరో బాంబుపేల్చారు.
మైక్రోసాఫ్ట్ ఏఐలో కోపైలట్ సహా పలు ఉత్పత్తులను విజయవంతంగా తీసుకొచ్చి నడుపుతున్న సీఈవో ముస్తఫా సులేమాన్ తాజాగా అదే ఏఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగాల కోతపైనా ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారని అంతకంటే పెద్ద సమస్య ఉద్యోగులు తక్కువ సమయంలో ఈ నైపుణ్యాలు నేర్చుకోవడమే అని ఆయన తేల్చిచెప్పేశారు. అంతే కాదు ఏఐ కారణంగా ఉద్యోగుల్లో ఓ కొత్త మానసిక సమస్య తలెత్తుతోందన్నారు.

ఏఐ సైకోసిస్ అనే కొత్త మానసిక రుగ్మత ప్రస్తుతం ఉద్యోగుల్లో కనిపిస్తోందని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్ తెలిపారు. కృత్రిమ మేథ రాకతో ఇప్పుడు ఉద్యోగులంతా ఏఐ సిస్టమ్స్ తో ఎక్కువ కాలం గడుపుతున్నారని, అంతిమంగా వారు తమ కుటుంబ సభ్యులు, దగ్గరి వ్యక్తులతో మానవ స్పర్శను కోల్పోతున్నారని, దీన్నే ఏఐ సైకోసిస్ అంటారని ఆయన వెల్లడించారు. బిజినెస్ ఇన్ సైడర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ఈ సంచలన హెచ్చరికలు చేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను ఎలా తొలగించాలో కంపెనీలు ఆలోచిస్తున్నాయని, అయితే వీటిపై కంటే వారిలో నైపుణ్యాలను తక్కువ సమయంలో ఎలా పెంచాలనేది సవాల్ గా మారిందన్నారు. సంస్ధలు కూడా ఇదే దిశలో ఆలోచించాలని మైక్రోసాప్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సూచించారు. శిక్షణ, అభ్యాసంలో వెనుకబడిన వారు కచ్చితంగా అన్నింట్లోనూ వెనుకబడి ఉండిపోతారని ఆయన తెలిపారు. ఏఐ తెస్తున్న మార్పుకు అనుగుణంగా ఉద్యోగుల్ని మార్చలేక సంస్ధలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సులేమాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications