శనివారం..పౌర్ణమి: దత్తాత్రేయుడిని పూజించే పవిత్ర రోజు..ఇలా చేయండి
ఆది గురువు..త్రిమూర్తి స్వరూపుడు..దేవతలకూ జ్ఞానబోధ చేసిన వాడు దత్తాత్రేయుడు. సృష్టి-స్థితి-లయకారులైన బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల ఏక స్వరూపం దత్తాత్రేయుడిది. గురుతత్వానికి ఆద్యుడు. ఆదిగురువు. ఈ శనివారమే దత్తాత్రేయ జయంతిని జరుపుకోబోతున్నాం. సమస్త దేవతలకూ ఆదిగురువులుగా పేరున్న సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. ప్రదోష కాలంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అత్రి మహర్షి కుమారుడు కావడం వల్ల ఆత్రేయుడిగా.. దత్తాత్రేయుడిగా పిలుస్తారు.
జ్ఞాన స్వరూపుడిగా..
దత్త స్వరూపాన్ని అసామాన్యమైనదిగా ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారం కావడం వల్ల ఈ విశిష్ఠత ఏర్పడింది. త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించిన వాడు. అలా ఆవిర్భవించినదే దత్తావతారం. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. దత్తుడు గొప్ప అవధూత.. మహాజ్ఞాని.. చిరంజీవిగా అవతరించాడు. పరిపూర్ణ జ్ఞానానికి నిలయమైన వాడిగా పూజిస్తారు.

16 అంశాలతో..
దత్తాత్రేయుడు 16 అంశలు కలవాడు. శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కల్‌కోట్ మహరాజ్, మాణిక్య ప్రభు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్, వాసుదేవానంద సరస్వతిగా దత్తావతారాలుగా వెలసినట్లు దత్త పురాణం చెబుతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
పలు రాష్ట్రాల్లో దత్త జయంతి వేడుకలు..
ఈ పర్వదినాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ల్లో జరుపుకొంటారు. మహారాష్ట్రలోని అక్కల్‌కోట్‌లో ఏక్‌ముఖి దత్తాత్రేయుడి ఆలయం ఉంది. కర్ణాటకలోని కలబురగి జిల్లా గాణగాపురలో దత్తాత్రేయుడి ఆలయం, ఆశ్రమం ఉన్నాయి. మాణిక్య ప్రభుగా మహారాష్ట్ర, శ్రీపాదవల్లభుడి రూపంలో గుజరాత్‌లో దత్తాత్రేయుడిని పూజిస్తారు. పవిత్ర మాసాల్లో ఒకటైన మార్గశిరంలో సంభవించే పౌర్ణమి నాడు దత్తాత్రేయుడి జయంతి కావడం ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

పూర్ణిమ తిథి ఇదే..
మార్గశిర పౌర్ణమి.. కార్తీక పౌర్ణమితో సమానంగా భావిస్తారు. శనివారం నాడు దత్తాత్రేయ జయంతి. పూర్ణిమ తిథి ఉదయం 7:24 గంటలకు ప్రారంభమౌతుంది. ఆదివారం ఉదయం 10:05 గంటలకు ముగుస్తుంది. దీన్ని మిగులు పౌర్ణమిగా భావిస్తారు. పూర్ణిమనాడే త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడి జయంతి కూడా కావడం వల్ల భక్తులు దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. వ్రతాలు చేస్తారు. నదులు, సముద్రాల్లో పుణ్యస్నానాలు చేసి, దత్తాత్రేయుడిని పూజించడానికి ప్రాధాన్యత ఇస్తారు.

దత్తాత్రేయుడిని పూజించడం వల్ల..
అలా చేయడం వల్ల సకల దోషాలు పోతాయని, ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే పేదలకు దాన ధర్మాలు చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. దత్తపురాణాన్ని పఠించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో పొందుపరిచన అంశాలతో దత్తాత్రేయుడిని పూజించాలి. త్రిమూర్తి స్వరూపుడు కావడం వల్ల దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుంటే.. బ్రహ్మ, శ్రీమహావిష్ణువు, పరమేశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.












Click it and Unblock the Notifications