అగ్నిపథ్: ఓ వైపు నిరసనలు సాగుతున్నా.. ఐఏఎఫ్‌కు వెల్లువలా దరఖాస్తులు, లక్షకు చేరువలో
న్యూఢిల్లీ: ఓ వైపు ఆందోళనలు సాగుతున్నప్పటికీ.. అగ్నిపథ్ నియామక పథకానికి
అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. భారత వాయుసేనలో నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు రావడం గమనార్హం. రిజిస్ట్రేషన్లు జులై 5 వరకు కొనసాగనున్నాయి.
ఈలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం నాటికి వాయుసేన 56,960 దరఖాస్తులు స్వీకరించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ బాబు వెల్లడించారు. ఇక, సోమవారం ఉదయం 10.30 గంటల నాటికి 94,281 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.

జూన్ 14న ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించగా, ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని ఉద్యోగార్థులు, యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పలు రాష్ట్రాల్లో అనేక రైళ్లను తగలబెట్టారు. అయితే, పథకంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.
వెనువెంటనే నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్లు కూడా వెలువడ్డాయి. అంతేగాక, కేంద్రంతోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు అగ్నిపథ్ పథకం ప్రయోజనాల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున యువకులు అగ్నిపథ్ నియామకాలకు దరఖాస్తులు చేస్తున్నారు.
ఇది ఇలావుండగా, అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ పథకం అగ్నిపథ్ కాదని.. అంధకార పథ్ అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. 'అగ్నివీర్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో శాంతియుత సత్యాగ్రహ దీక్షలను చేపట్టింది. 'యువతకు న్యాయం జరిగే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి' అని రాహుల్ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అగ్నిపథ్ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications