"AIతో ఉద్యోగాల ముప్పుకు సిద్దమైపోండి.."-మరో బాంబుపేల్చిన జోహో శ్రీధర్ వెంబూ..!
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేథ (AI) ఉద్యోగాలను వరుసగా మింగేస్తోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలతో ప్రారంభించి ఇప్పుడు మిడ్ లెవెల్ ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంకా చెప్పాలంటే కంప్యూటర్ పై పనిచేసే ప్రతీ ఉద్యోగీ ఇప్పుడు ఏఐ తన ఉద్యోగాన్ని ఎప్పుడు మింగేస్తుందన్న టెన్షన్ లోనే ఉన్నాడు. ఇదే విషయాన్ని తమిళనాడుకు చెందిన జోహో (Zoho) సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ (Sridhar Vembu) మరోసారి భారతీయులకు గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
కంప్యూటర్‌పై చేసే ఏ పనిలోనైనా ఇప్పుడు ఈ ప్రమాదం పొంచి ఉందని శ్రీధర్ వెంబూ వెల్లడించారు. ఏఐ (AI)ని ఉపయోగించే ఒక తెలివైన వ్యక్తి 10 మంది చేయాల్సిన పనిని చేయగలడని ఆయన తెలిపారు. ఈ ప్రమాదం రోజురోజుకీ మరింత వాస్తవరూపం దాల్చుతోందన్నారు. దీని అర్థం కంప్యూటర్‌పై పనిచేసే 90% మందికి అసలు పని ఉండదని కాదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఉదాహరణకు, గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను లేదా డిజిటల్ మార్కెటర్లను నియమించుకోలేని పరిశ్రమలు ఇప్పుడు వారిని నియమించుకోగలుగుతున్నాయని శ్రీధర్ తెలిపారు.

దీని అర్థం ఏమిటంటే, ఆర్థిక వ్యవస్థ అంతటా ఒక పునఃసమతుల్యత ఏర్పడుతోందన్నారు. మనం దానిని అనుభవించినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుందని శ్రీధర్ వెంబూ తెలిపారు. మనం చేయగలిగింది ఒక్కటే, అది రాబోతోందని అంగీకరించి, దానికి సిద్ధంగా ఉండటమే అని ఆయన తేల్చిచెప్పేశారు. ఇప్పటికే ఏఐ దూకుడు కారణంగా తన జోహో సంస్థ సైతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని శ్రీధర్ తాజాగా వెల్లడించారు. అంతే కాదు తన ఉద్యోగులకు ఈ ఏడాది ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు. ప్రతీ ఐటీ సంస్థా చెబుతున్నట్లే ఉద్యోగాలు కాపాడేందుకు జీతాలు పెంచడం లేదంటూ ఓ సాకును శ్రీధర్ వెంబూ చెప్పేశారు. సంస్థను కాపాడుకోవాలంటే ఈ ఏడాది ఉద్యోగాల జీతాలు పెంచలేమంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇన్నాళ్లూ భారత్ లో విజయవంతమైన స్టార్టప్ సంస్థగా గుర్తింపుతెచ్చుకుని, ఎలాంటి అర్హతలు లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చిన సంస్థగా పేరొందిన జోహోను కూడా ఏఐ వదలడం లేదని అందరికీ అర్ధమైంది.














Click it and Unblock the Notifications
