Zoho ఉద్యోగులకు శ్రీధర్ వెంబూ షాక్..! క్షమాపణలు..!
తమిళనాడు కేంద్రంగా సాఫ్ట్ వేర్ సంస్థ జోహో (Zoho)ను నడుపుతూ, ఎప్పుడూ స్వదేశీ మంత్రం జపించే దాని వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ (Sridhar Vembu) ఈసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. డిగ్రీలు లేకపోయినా ఉద్యోగాలు ఇస్తానంటూ చెప్పుకునే శ్రీధర్.. సంస్ధలో పెరుగుతున్న ఏఐ వ్యయాలను కారణంగా చూపుతూ ఉద్యోగులకు ఈసారి ఇంక్రిమెంట్ ఇవ్వడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. అంతే కాదు ఇలాంటి పరిస్ధితి కల్పిస్తున్నందుకు ఉద్యోగులకు క్షమాపణలు కూడా కోరారు.
పెరుగుతున్న ఏఐ వ్యయం కారణంగా ఖర్చులను నియంత్రించడం తమ కంపెనీకి కష్టంగా మారిందంటూ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ ఇప్పుడు అంగీకరించారు. దీంతో ఈ ఏడాది అప్రైజల్స్‌ను రద్దు చేయాలని జోహో నిర్ణయించిందని ప్రకటించారు. మార్కెటింగ్‌తో సహా పలు విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవడానికి తమ కంపెనీ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఈసారి అప్రైజల్స్ ఇవ్వనందుకు తన ఉద్యోగులకు క్షమాపణలు చెప్పినట్లు వెంబూ తెలిపారు. అదే సమయంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోందని, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, సామూహిక ఉద్యోగాల కోతలు నివారించడానికి జోహో తన వంతు ప్రయత్నం చేస్తోందన్నారు. 18 నెలలుగా తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం లేదన్నారు.

టెక్ పరిశ్రమ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, టీసీఎస్‌తో సహా అనేక కంపెనీలు తాజాగా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయని, layoffs.fyi ప్రకారం ఒక్క 2026లోనే 1,31,000 మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. సాఫ్ట్‌వేర్ వ్యాపార భవిష్యత్తు అనిశ్చితంగా ఉందని, ఏఐ ఖర్చులను నాటకీయంగా పెంచిందని ఆయన తెలిపారు. దీనికి కారణాలు చూస్తే డేటా సెంటర్ల కోసం తమకు అవసరమైన సర్వర్ల ధరలు భారీగా 4 రెట్లు పెరగడం, ఏఐ వాడకం వేగంగా పెరగడం వల్ల ఖర్చులు మరింత పెరగడం, వీటిని తాము నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వీటన్నింటికీ తోడు, సవాలుతో కూడిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు. అయితే పెరుగుతున్న ఖర్చులు జోహోకు ఒక్కసారి మాత్రమే ఎదురయ్యే సమస్య కాకపోవచ్చని శ్రీధర్ వెంబూ తేల్చేశారు. ఈ పరిస్థితికి అనుగుణంగా మారడానికి కంపెనీ మార్పులు చేయబోతోందని, ఫలితాలు కనిపించడానికి జోహోకు కొంత సమయం పట్టవచ్చన్నారు.














Click it and Unblock the Notifications
