సీటెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరోసారి పరీక్ష తేదీ మార్పు.. కొత్త తేది ఇదే..
సీటెట్ అభ్యర్థులకు ముఖ్యగమనిక.. సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2024 పరీక్ష తేదీ మరోసారి మారింది. ఈ పరీక్ష నిర్వహణ తేదీలో మళ్లీ మార్పు చోటుచేసుకున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. ఈ మేరకు సీబీఎస్‌ఈ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. సీబీఎస్ఈ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15వ తేదీన కాకుండా, డిసెంబర్ 14న (శనివారం) పరీక్షను నిర్వహించనున్నారు.
సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష ఓఎమ్మార్ ఆధారితంగా జరగనుంది. అయితే, ఈ దరఖాస్తు తేదీల్లో ఎలాంటి మార్పు చేయలేదని సీబీఎస్ఈ పేర్కొంది. కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 15వ తేదీన పోటీ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష తేదీని మార్చామని సీబీఎస్‌ఈ తెలిపింది. ఏదైనా నగరంలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం సీటెట్ పరీక్షను డిసెంబర్ 15వ తేదీ కూడా నిర్వహించే అవకాశం ఉందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.

ఏడాదికి రెండుసార్లు..
సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లలో ఉంటుంది. పేపర్ 1 ఒకటో తరగతి నుంచి ఐదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం, పేపర్2 ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ జీవితకాల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు. ఇక, ఈ పరీక్షలో సాధించిన స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
పరీక్షా కేంద్రాలివే..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సీటెట్ 2024 పరీక్ష నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications