JEE Main 2024 Session 1 Exam: రేపే జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష-అభ్యర్ధులకు సూచనలివే..!
జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు ఎన్టీఏ పలు సూచనలు చేస్తోంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఏమేం తీసుకురావాలి, పరీక్ష సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది. కాబట్టి జేఈఈ మెయిన్ రాసే అభ్యర్ధులు తప్పక వీటిని పాటించాల్సి ఉంటుంది.
రేపు జేఈఈ మెయిన్ సెషన్ 1 పేపర్ 2 పరీక్ష బీఆర్క్, బీప్లానింగ్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మాత్రమే నిర్వహిస్తారు. అలాగే రెండు షిఫ్ట్ లలో ఈ పరీక్ష జరగనుంది. తొలి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ జరగనుంది. అలాగే రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. మరోవైపు జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్షలు అధికారికంగా జనవరి 27న ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రేపు జరిగే జేఈఈ మెయిన్ సెషన్ 1 పేపర్ 2 పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులు ఏమేం తీసుకెళ్లాలనే దానిపై ఎన్టీఏ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో జేఈఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీ, ఎన్టీఏ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్, దరఖాస్తు ఫారమ్ పై ఉన్న ఫొటో లాంటి పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ధృవీకరణ కోసం ఒరిజినల్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఐడీ కార్డుల్లో పాఠశాల గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్ లేదా ఆధార్ కార్డ్ తీసుకెళ్లవచ్చు.
పీడబ్ల్యూడీ కేటగిరీ కింద సడలింపు కోరుకునే వారు తప్పనిసరిగా అధీకృత వైద్య అధికారి జారీ చేసిన పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధులు పరీక్ష రాసేందుకు నలుపు లేదా నీలం రంగు బాల్ పెన్ను తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రానికి ప్లేన్ వాటర్ బాటిల్ తీసుకురావడానికి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications