AP TET Results: టెట్ ఫలితాలపై విద్యాశాఖ క్లారిటీ-అప్పుడేనట..!
ఏపీలో 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అంతకంటే ముందే టెట్ పరీక్షలు నిర్వహించింది. మార్చి 14న వీటి ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కారణంగా ఈ ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో అభ్యర్ధుల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. టెట్ పరీక్ష పాసైతేనే డీఎస్సీ రాసేందుకు వీలుండటంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది. దీంతో విద్యాశాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం పరీక్షలు నిర్వహించాలన్నా, వాటి ఫలితాలు విడుదల చేయాలన్నా, తదుపరి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి. దీంతో టెట్ ఫలితాల విడుదల వ్యవహారాన్ని ఈసీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం ప్రకారం ఫలితాల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో సమాచారం ఇచ్చింది.
మరోవైపు ప్రభుత్వం ఎన్నికలకు ముందే డీఎస్సీ పరీక్షల్ని కూడా పూర్తి చేయాలని భావించినా షెడ్యూల్ ప్రకటనలో జరిగిన ఆలస్యంతో కథ మొదటికొచ్చింది. ఇప్పటికే హైకోర్టు తీర్పు కారణంగా డీఎస్సీ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం... మార్చి 30 నుంచి నిర్వహిస్తామని ప్రకటన చేసినా ఇది కూడా సాధ్యమయ్యేలా లేదు. డీఎస్సీ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ కుప్పలు తెప్పలుగా వచ్చిన వినతులతో ఈసీ విద్యాశాఖ వివరణ కోరింది. దీనిపై విద్యాశాఖ స్పందించలేదు. దీంతో డీఎస్సీ పరీక్షలపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. తాజా పరిస్దితుల నేపథ్యంలో కొత్త ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేలా ఉంది.












Click it and Unblock the Notifications