ఇంటర్ సిలబస్, పరీక్షల విధానంలో తాజా మార్పులు..!!
ఇంటర్ సిలబస్, పరీక్షల విధానంలో మార్పులకు ఏపీ ఇంటర్ బోర్డు ప్రతిపానదలు సిద్దం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌తోపాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. పూర్తి ప్రక్షాళన దిశగా అడుగు పడుతున్నాయి. ఇకపై అంతర్గత పరీక్షలు కామన్‌గా నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.ఈ మేరకు ఇంటర్ విద్యామండలి అధికారులు టైమ్ టేబుల్‌ను ఈ రోజు విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.
ప్రక్షాళన
ఇంటర్ పరీక్షల విధానం ప్రక్షాళన దిశగా ఇంటర్ విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటోది. ఇప్పటి వరకూ ఎవరికివారే అన్నట్టుగా కాలేజీల స్థాయిలో అంతర్గత పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కాలేజీలు నిర్దేశించుకున్న పాఠ్యాంశాలపై, వారే నిర్ణయించుకున్న తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్య తరహాలోనే ఏటా అకడమిక్ క్యాలెండర్ ఇంటర్‌లోనూ తయారు చేస్తున్నారు. దీంతో, పాఠశాల విద్యా శాఖలో అకడమిక్ క్యాలెండర్ విధానం అమల్లో ఉంది. ఏ నెలలో ఏ పాఠాలు చెప్పాలనే అంశంతో పాటుగా ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఏటా ఆ శాఖ క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఇంటర్‌లోనూ సంక్షిప్తంగా అకడమిక్ క్యాలెండర్‌ను తయారు చేస్తున్నారు.

పరీక్షల్లో మార్పులు
తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం పరీక్షా విధానంలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ లాంటి గ్రూపులతో పాటు కొన్ని వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో సుమారు 2.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ విద్యామండలి రూపొందించిన కొత్త టైమ్ టేబుల్‌లో తేదీలతో పాటు ఏ నెలలో ఏ పాఠాలు చెప్పాలనే వివరాలు కూడా పొందుపరిచింది. ఫైనల్ పరీక్షలు కాకుండా సంవత్సరంలో నాలుగు యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఇప్పటికే యూనిట్-1 పరీక్షలు పూర్తయ్యాయి. యూనిట్-2 నుంచి అన్ని కాలేజీలు ఒకే సిలబస్ ఫాలో అయ్యేలా నూతన విధానం అమలు చేస్తున్నారు.
టైమ్ టేబుల్ సిద్దం
ప్రస్తుతం ఉన్న విధానంలో ఈ పరీక్షలకు కాలేజీలే ప్రశ్నపత్రాలు తయారు చేసుకున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డే అన్ని పరీక్షలకు ప్రశ్నపత్రాలు పంపుతుంది. పరీక్షలు జరిగే రోజు ఉదయం కాలేజీల ప్రిన్సిపాళ్లకు పేపర్లు పంపుతారు. లెక్చరర్లు పరీక్షల మూల్యాంకనం అనంతరం విద్యార్థుల మార్కులను ఇంటర్ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అంతర్గత పరీక్షలతో పాటు ఫైనల్ పరీక్షలపైనా ఇంటర్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇంటర్‌లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానం అమలుపై అధ్యయనం చేస్తున్నారు. జేఈఈ, నీట్‌లో ఇంటర్ మార్కులు ప్రామాణికంగా తీసుకుంటారు. సీబీఎస్ఈలో గ్రేడింగ్ ఉన్నప్పటికీ మార్కులూ ఇస్తున్నారు. ఏపీలోనూ ఇదే అమలు చేయలా..గ్రేడింగ్ పూర్తిగా అమలు చేయాలా అనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications