AP TET Results 2024: ఇవాళ ఏపీ టెట్ ఫలితాలు-జూలై 1న డీఎస్సీ నోటిఫికేషన్ ?
ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణకు నిన్న కేబినెట్ లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలో అంతకు ముందు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేయబోతోంది. ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసే అర్హత లభిస్తుంది. అలాగే ఎక్కువ మంది టెట్ పరీక్ష కోరుకుంటే మరోసారి టెట్ నిర్వహణపై ప్రభుత్వం ఆలోచన చేయనుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకూ వివిధ కేటగిరీల అభ్యర్ధులకు టెట్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను మార్చి 14న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఇది సాధ్యం కాలేదు. ఎన్నికల సంఘానికి టెట్ ఫలితాల విడుదలపై గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా అంగీకరించలేదు. దీంతో టెట్ ఫలితాలు విడుదల కాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్దమవుతున్న తరుణంలో టెట్ ఫలితాల విడుదలకు విద్యాశాఖ సిద్ధమైంది.

డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించాలంటే టెట్ లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. అలాగే డీఎస్సీ పరీక్షలో టెట్ ఫలితాల్లో 20 శాతం వెయిటేజ్ కూడా ఇస్తారు. దీంతో కీలకమైన టెట్ పరీక్ష ఫలితాల కోసం అభ్యర్దులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఫలితాల విడుదలపై విద్యాశాఖ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఫలితాలు ఇవాళ విడుదలవుతాయని మాత్రమే అధికారులు వెల్లడించారు. ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతాయన్న దానిపై ఇవాళ క్లారిటీ ఇవ్వనున్నారు. టెట్ ఫలితాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ను జూలై 1న ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications