OSM వివాదం తీవ్రం..! CBSE ఛీఫ్ కు పార్లమెంట్ సమన్లు..!
సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల్లో చోటు చేసుకున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఈ వివాదం కారణంగా లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తు ప్రమాదంలో పడిన నేపథ్యంలో.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపై స్పందించింది. సీబీఎస్ఈ ఛైర్ పర్సన్ రాహుల్ సింగ్ తో పాటు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కు తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపింది.
సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సాఫ్ట్ వేర్ టెండర్ల నిబంధనలను సడలించి నాసిరకంగా ఉన్న విధానాన్ని వాడారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. దీని వల్లే అక్రమాలు చోటు చేసుకున్నాయని, 50 మంది విద్యార్దులకు అనధికారికంగా దీని యాక్సెస్ లభించిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో సాంకేతిక లోపాలు, మూల్యాంకన వ్యత్యాసాలు, ఫలితాల అనంతరం ధృవీకరణ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటరీ కమిటీ విచారణ చేపడుతోంది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కీలక విద్యాశాఖ అధికారులకు సమన్లు జారీ చేసింది.

OSM అమలు, విద్యార్థులు నివేదించిన సవాళ్లపై అధికారులు కమిటీకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో సీబీఎస్‌ఈ విద్యార్థుల ప్రతినిధులు సైతం పాల్గొని, తమ ప్రత్యక్ష అనుభవాలను కమిటీకి అందిస్తారు. సోషల్ మీడియా, విద్యార్థి ఫోరమ్‌లలో చర్చనీయాశంగా మారిన సమస్యలపై వీరి అభిప్రాయాలు కీలకంగా మారాయి. ఈ వివాదంలో సాంకేతిక, సైబర్ సెక్యూరిటీ కోణాలను పరిశీలించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) డైరెక్టర్ జనరల్‌ను కూడా కమిటీ పిలిపించింది. సిస్టమ్ గ్లిచ్‌లు, డేటా సమగ్రత, డిజిటల్ మూల్యాంకన మౌలిక సదుపాయాల పటిష్టతపై ప్రజల్లో వ్యక్తమైన ఆరోపణల నేపథ్యంలో వీరి ప్రమేయం కీలకంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ, 9వ, 10వ తరగతులకు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై కూడా చర్చించనుంది.












Click it and Unblock the Notifications