CBSE Open Book Exams: ఇక పుస్తకాలతోనే సీబీఎస్ఈ పరీక్షలు-నవంబర్లో పైలట్ రన్.. !
దేశవ్యాప్తంగా విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విద్యార్ధుల అవసరాలు మారిపోతున్నాయి. దీంతో చదువులతో పాటు పరీక్షల్లోనూ మార్పులు చేసేందుకు కేంద్ర ప్రాథమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు విద్యాసంస్కరణలను తీసుకొచ్చిన సీబీఎస్ఈ ఇప్పుడు మరో కొత్త విధానంతో ముందుకొస్తోంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో అమలవుతున్న ఓపెన్ బుక్ విధానంలోనే పరీక్షల నిర్వహణకు సీబీఎస్ఈ ప్రతిపాదిస్తోంది.
గతేడాది విడుదల చేసిన జాతీయ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ నిర్వహించే పరీక్షల్లో ఓపెన్ బుక్ విధానం తీసుకురావాలని సీబీఎస్ఈ భావిస్తోంది. ఇందులో బోర్డు పరీక్షలతో పాటు ఇతర వార్షిక పరీక్షలు కూడా ఉంటాయి. పుస్తకాల సాయంతో పరీక్షలు రాయించే పాశ్చాత్య దేశాల ఫార్మాట్ తరహాలోనే ఇప్పుడు మన స్కూళ్లలోనూ ఈ విధానంలో అమలు చేసేందుకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం ఈ ఏడాది నవంబర్ లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు కూడా సీబీఎస్ఈ సిద్దమవుతోంది. 9, 10 తరగతులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఇలా ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు ట్రయల్ రన్ లో నిర్వహించబోతున్నారు. అలాగే 11, 12 తరగతులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీలో ఇలా పరీక్షలు ట్రయల్ రన్ లో నిర్వహించేందుకు సీబీఎస్ఈ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు రాసేందుకు విద్యార్ధులు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు ఇతర స్టడీ మెటీరియల్ కూడా వాడుకునేందుకు అనుమతిస్తారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే వచ్చే ఏడాది నుంచి పూర్తిస్ధాయిలో అమలు చేస్తారు.












Click it and Unblock the Notifications