NEET 2024 Retest: నీట్ పై కేంద్రం సంచలన నిర్ణయం- జూన్ 23న వీరికి మళ్లీ పరీక్ష..!
ఈ ఏడాది నీట్ పరీక్షలో చోటు చేసుకున్న పరిణామాలు విద్యార్ధుల్లో కలవరం రేపుతున్నాయి. అదే సమయంలో నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్ధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. నీట్ 2004 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్ధులకు తిరిగి పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలిపింది.

ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ 2004 పరీక్ష నిర్వహణలో ఆలస్యం కారణంగా 1563 మంది అభ్యర్ధులకు గ్రేస్ మార్కులు ఇచ్చారు. దీంతో మిగతా అభ్యర్ధులు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్బంగా కేంద్రం నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇచ్చిన 1563 అభ్యర్ధుల స్కోర్ కార్డుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వీరికి జూన్ 23న మరోసారి పరీక్ష నిర్వహించి జూన్ 30న ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.
నీట్ యూజీ పరీక్ష సందర్భంగా తగినంత సమయం దొరకలేదనే కారణంతో గ్రేస్ మార్కులు ఇచ్చిన అభ్యర్ధుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసామని, దాని సిఫార్సుల ఆధారంగా వీరు రాసిన పరీక్ష, స్కోరు కార్డుల్ని రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు.. వీరి ఫలితాలు వచ్చే వరకూ కౌన్సిలింగ్ నిర్వహించ వద్దని ఆదేశించింది. దీంతో ఫలితాలు వచ్చాక జూలై 6న ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో నీట్ పిటిషన్ల విచారణ జూలై8కి వాయిదా వేశారు.
నీట్ పరీక్షలో లీకులపై వచ్చిన ఆరోపణలు, పిటిషన్లపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లా స్పందిస్తూ.. తాము కౌన్సెలింగ్‌ను ఆపడం లేదని, ఈ కేసును జులై 8కి వాయిదా వేసి, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందు దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని తెలిపారు.












Click it and Unblock the Notifications