సీయూఈటీ - యూజీ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. రేపటినుంచే పరీక్షలు..
సీయూఈటీ యూజీ 2024 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ పరీక్షను నిర్వహిస్తారు. ఈ మేరకు 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 27 ఎన్‌టిఎ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఫిబ్రవరి 27 నుంచే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 26 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించుకున్నారు.
మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కూడా కల్పించారు. ఇక, ఇప్పడు తాజాగా, వీటి అడ్మిట్‌కార్డులను కూడా ఎన్‌టిఎ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ పరీక్షకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక, ఈ పరీక్ష ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. సీయూఈటీ యూజీ 2024 పరీక్షలు ఈ నెల 5 నుంచి 18 మధ్య నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ వివరించింది. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేసి https://exams.nta.ac.in/CUET-UG/ తమ అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోగలరు.

పరీక్ష విధానం...
దేశవ్యాప్తంగా ఉన్న 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 13.48 లక్షల మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు. ఈ పరీక్షలు తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు జరగనున్నాయి. యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరగనుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో ఉంటుంది. ఇక, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ఒక్కో తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇక, రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications