ఐసీఎస్ఈ పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు వెల్లడి: ఎగ్జామ్ టైమింగ్ లో మార్పులు
ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి వార్షిక పరీక్షల టైమ్ టేబుల్ ను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం 10వ తరగతి పరీక్షలు 2027 ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమౌతాయి. 12వ తరగతి పరీక్షలు అదే నెల 9 నుంచి మొదలవుతాయి. పూర్తి సబ్జెక్టుల వారీ టైమ్‌టేబుల్‌ను కౌన్సిల్ తన అధికారిక పోర్టల్‌లో కూడా పొందుపరిచింది.
దేశవ్యాప్తంగా మొత్తం 3,79,980 మంది అభ్యర్థులు ఈ పరీక్షలను రాయనున్నారు. వీరిలో 10వ తరగతి ఐసీఎస్ఈ విభాగానికి సంబంధించి 3,106 అనుబంధ పాఠశాలల నుంచి సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులు, 12వ తరగతి ఐఎస్సీ విభాగానికి సంబంధించి 1,651 పాఠశాలల నుంచి 1,10,025 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఐసీఎస్ఈకి 2,835 కేంద్రాలు, ఐఎస్‌సీకి 1,477 పరీక్షా కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేస్తోంది.

10వ తరగతి ఐసీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి 15న ఇంగ్లీష్ పేపర్ 1తో ప్రారంభమౌతాయి. మార్చి 31న ఎకనామిక్స్, ఫ్రెంచ్ లేదా సంస్కృతం పేపర్లతో ముగియనున్నాయి. ప్రధాన సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ పేపర్ 2 ఫిబ్రవరి 18న, మేథమేటిక్స్ 22న, హిస్టరీ అండ్ సివిక్స్ 26వ తేదీన జరుగుతాయి. సైన్స్ విభాగంలో ఫిజిక్స్ పరీక్ష మార్చి 8న ఉంటుంది. కెమిస్ట్రీ 12న, బయాలజీ మార్చి 15న నిర్వహించనున్నారు. మొత్తం 76 సబ్జెక్టులకు ఐసీఎస్ఈ పరీక్షలను నిర్వహించనుంది.
ఇక 12వ తరగతి ఐఎస్సీ పరీక్షలు ఫిబ్రవరి 9న ఎన్విరాన్మెంటల్ సైన్స్, వెస్ట్రన్ మ్యూజిక్ పేపర్‌తో ప్రారంభమై ఏప్రిల్ 8న లీగల్ స్టడీస్ పూర్తవుతాయి. 10న ఇంగ్లీష్ 1, 18న ఎకనామిక్స్, 24న కెమిస్ట్రీ, 26న అకౌంటెన్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 1న మేథమేటిక్స్, 8న ఫిజిక్స్, 11న బిజినెస్ స్టడీస్, 12న జాగ్రఫీ, 15న బయాలజీ పరీక్షలు ఉంటాయి. 19న హిస్టరీ, ఏప్రిల్ 2వ తేదీన పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరగనున్నాయి.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల నిబంధనల్లో మండలి స్వల్ప మార్పులు చేసింది. ఉదయం 10 గంటలకు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థుల చేతికి ఇస్తారు ఇన్విజిలేటర్లు. 15 నిమిషాల తర్వాత 10:15 నిమిషాల నుంచి సమాధానాలు రాయడానికి అనుమతిస్తారు. గతంలో ఇది ఉదయం 10:45 గంటలకు ప్రారంభమై 11:00 గంటలకు రాయడం మొదలయ్యేది. మార్పు చేసిన వేళల ప్రకారం విద్యార్థులు ఉదయం 9:45 గంటలకే పరీక్షా హాల్‌కి చేరుకోవాలి.
పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఈ ఏడాది డిసెంబర్ మధ్యలో అందజేస్తారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలకు అనుగుణంగా మూల్యాంకన విధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు సీఐఎస్సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ డాక్టర్ జోసెఫ్ ఇమ్మాన్యుయెల్ తెలిపారు. విద్యార్థులు బట్టీ పద్ధతిని ప్రోత్సహించకుండా పాఠ్యాంశాలపై సంపూర్ణ అవగాహన, తార్కిక ఆలోచన, నైపుణ్యాలను పెంపొందించేలా ప్రశ్నపత్రాల రూపకల్పన ఉంటుందని ఆయన చెప్పారు.















Click it and Unblock the Notifications
