జాగ్రత్తగా ఉండాలి, మన టార్గెట్ అదే - మంత్రులకు తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ కేబినెట్ పలు అంశాల పైన చర్చ చేసి ఆమోద ముద్ర వేసింది. విశాఖ కేంద్రంగా జరిగే పెట్టుబడుల సదస్సు పైన ప్రధానంగా చర్చించిన కేబినెట్.. మంత్రులంతా ఈ సదస్సు విజయవంతానికి బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. ఇక, తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల పైన సమీక్ష చేసారు. ఈ సమయంలోనే మంత్రులకు సీఎం చంద్రబాబు అసలు లక్ష్యాన్ని వివరించారు. కాగా.. పలు పెట్టుబడులకు చెందిన ప్రతిపాదన లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ కేబినెట్ లో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అధికారిక అజెండా పూర్తియిన తరువాత సీఎం చంద్రబాబు రాజకీయ అంశాల పై మంత్రులకు నిర్దేశం చేసారు. స్థానిక ఎన్నికలు విజయం చూసుకొని గర్వంతో విర్రవీగిపోవద్దని సూచించారు. ఒద్దికగా ఉండండి.. భవిష్యత్తు పై దృష్టి పెట్టండని స్పష్టం చేసారు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి... మనం ప్రజలకు మేలు చేయాలని.. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేస్తున్నామని వివరించారు. మనం 2029 పై దృష్టి పెట్టాలి... ఆ దిశగా అందరం పని చేయాలని స్పష్టం చేసారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల పై కేబినెట్ లో చర్చ జరగ్గా.. బియ్యం ధరలు పెరిగిన తరుణంలో మనం రైతు బజార్లలో ధర తగ్గించి బియ్యం ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. కూర గాయల ధరలు తగ్గాయి.. బియ్యం ధరలు తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు ధరల భారం ఉండకూడదని స్పష్టం చేసారు.

పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
కాగా, పలు కీలక అజెండాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ పాలసీ 2026-31కు ఆమోద ముద్ర వేసారు. ఏపీ రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ 2026-36 తో పాటుగా సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎప్యాక్ డేటా సెంటర్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ క్లౌడ్ హబ్ ప్రతిపాదనపై ఐటీ శాఖ పరిశీలనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు భూమి కేటాయింపు, భీమిలి మండలం అమనంలో 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రావళి స్పిన్నర్స్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించేందుకు.. రాథీ గ్రీన్ ఎనర్జీ, న్యూలాండ్ ల్యాబొరేటరీస్‌కు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా.. నక్కపల్లి లో హెటెరో గ్రూప్‌కు 173.82 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications
