JEE and NEET Merger: ఒకే పరీక్షగా నీట్, జేఈఈ ? కేంద్రం తాజా ప్లాన్..!
నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ పై ఓవైపు సీబీఐ దర్యాప్తు, మరోవైపు పార్లమెంటరీ కమిటీ విచారణ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇంజనీరింగ్, ప్లానింగ్, ఆర్టిటెక్చర్ కోర్సుల కోసం నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ)ని, వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను కలిపేసేందుకు (JEE and NEET) కేంద్రం చర్చలు జరుపుతోంది.
ఇకపై ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ విధానం అమల్లోకి వస్తే, జేఈఈ, నీట్ వంటి ప్రస్తుత జాతీయ స్థాయి పరీక్షల స్థానంలో ఇది వస్తుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసినప్పటికీ, ఇంజినీరింగ్, మెడికల్ విభాగాలకు ప్రత్యేక సెక్షన్లు ఉంటాయి. విభిన్న రంగాలలోకి ప్రవేశ మార్గాలను సులభతరం చేయడమే లక్ష్యంగా.. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా.. ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ద్వారా విద్యార్థులు వివిధ కోర్సుల మధ్య సులభంగా మారడానికి వీలు కలుగుతుంది.

తాజా వ్యవస్థ ప్రకారం విద్యార్థులు ఒకే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్షలో ఇంజినీరింగ్ అభ్యర్ధుల కోసం గణితం, మెడికల్ అభ్యర్ధుల కోసం జీవశాస్త్రం వంటి ప్రత్యేక విభాగాలు ఉంటాయి. నిన్న జరిగిన సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులకు ఈ నూతన ఆలోచన గురించి వివరించగా, వారు దీనికి మద్దతు తెలిపారు. ఈ విధానాన్ని 'సరళీకృతమైన, మరింత సమర్థవంతమైన ప్రవేశ విధానంగా వారు అభివర్ణించారు. నీట్ అభ్యర్థుల వయోపరిమితులు, ప్రయత్నాల సంఖ్యపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎన్‌టీఏ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, సౌలభ్యాన్ని పెంచడానికి బహుళ సెషన్లలో, దశల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

రెండేళ్లలో రెండోసారి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేఫథ్యంలో ఈ సమావేశం జరిగింది. రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులలో దాదాపు 70 శాతం అప్పటికే ఆమోదించినట్లు పార్లమెంటరీ కమిటీకి అధికారులు తెలిపారు. కొన్ని దీర్ఘకాలిక, మధ్యకాలిక సిఫార్సులను ఇంకా అమలు చేయాల్సి ఉందన్నారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించడానికి, సిండికేట్ ముఠాలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి రాధాకృష్ణన్ కమిటీ సూచించిన విధంగానే, జిల్లా స్థాయి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, భద్రతా ఏజెన్సీలతో కలసి ప్రభుత్వం నిశితంగా పనిచేస్తోందన్నారు. పరీక్షా వ్యవస్థను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడానికి ఎన్టీఏ పనితీరును పరిశీలిస్తున్నామని, దాని అంతర్గత వ్యవస్థలు, ఔట్‌సోర్సింగ్ యంత్రాంగాలు, విక్రేతల జవాబుదారీతనంతో సహా అన్నింటినీ పటిష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications