ఏఐ ఎఫెక్ట్: ఎక్కువ ఉద్యోగాలివ్వబోతున్న చిన్న సంస్ధలు..! నందన్ నీలేకని జోస్యం..!
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ) దూకుడు కొనసాగుతోంది. ప్రతీ రోజూ కొత్త కొత్త ఏఐ ఏజెంట్లు, ఎల్ఎల్ఎంలు పుట్టుకొస్తున్నాయి. వీటి కారణంగా కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుని, ఏఐపై ఎక్కువగా ఖర్చుపెట్టడం మొదలుపెట్టాయి. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలు తప్పడం లేదు. భారత్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ నేపథ్యంలో ఏఐ దూకుడు కారణంగా భారత్ లో ఉద్యోగాలపై పడుతున్న ప్రభావంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు కూడా అయిన నందన్ నీలేకని (Nandan Nilekani) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వ్యాప్తి చేయడంలో, దానిని పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడేలా చేయడంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని, దీని సాయంతో భవిష్యత్తులో చిన్న వ్యాపారాల నుంచి కొత్త ఉద్యోగాలు వస్తాయని నందన్ నీలేకని తెలిపారు. ఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2026లో నీలేకని మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను ఒకే చోట బంధించలేమని, ఎందుకంటే వేలాది మోడళ్లు రాబోతున్నాయని, దీనిని విపత్తు మార్కెటింగ్ కోణంలో చూడకూడదన్నారు. చిన్న వ్యాపారాలకు భారతదేశం ఇప్పటికే ఒక బలమైన దేశమని, ఉద్యోగాల కల్పన అక్కడే జరుగుతుందన్నారు. ఎందుకంటే 3-5 మంది ఉద్యోగులున్న చిన్న కంపెనీలో ఉద్యోగాలను ఆటోమేట్ చేయడం నిజంగా సాధ్యం కాదన్నారు.

వారు ఉదయం చాలా క్లిష్టమైన పనులు చేస్తారని, మధ్యాహ్నం వాటిని తీసుకుని సాయంత్రం షెల్ఫ్‌లో సర్ది, డెలివరీ చేస్తారన్నారు. ఇవి నిజానికి ఏఐ-ప్రూఫ్ ఉద్యోగాలు కాబట్టి, భారతదేశం తన చిన్న వ్యాపార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించినప్పుడు, లక్షలాది చిన్న కంపెనీలు ఒక్కొక్కటి ఇద్దరు వ్యక్తులను నియమించుకుంటాయి, ఆ విధంగానే ఉద్యోగాలు ఏర్పడతాయన్నారు. కాబట్టి, ఓపెన్ నెట్‌వర్క్‌లు, ఏఐ ద్వారా కొత్త ఉద్యోగాల సృష్టిని మనం చూడబోతున్నట్లు నీలేకని పేర్కొన్నారు. ఇది మనం ఇంతకు ముందెన్నడూ చూడని ఒక నమూనా అన్నారు. అందువల్ల మనం దానిని ఊహించలేమన్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో ఆయన ఎలాంటి కాలపరిమితిని అంచనా వేయనప్పటికీ, భారతీయ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారాలు మార్కెట్లు, మూలధనం, జ్ఞానం, ఏజెంట్ల లభ్యత ద్వారా ప్రయోజనం పొంది, వారి జీవితాలను సులభతరం చేసుకుని, ఉద్యోగాల సృష్టికి చోదక శక్తులుగా మారతారని మాత్రం వెల్లడించారు. క్లయింట్స్ అవసరాలు అర్దం చేసుకుంటే కోడింగ్ తోనూ ఉద్యోగాలు వస్తాయన్నారు.














Click it and Unblock the Notifications
