Jobs : పదో తరగతి అర్హతతో 12 వేలకు పైగా ఉద్యోగాలు-రూ.10 వేల నుంచి రూ.30 వేల జీతం..
నిరుద్యోగులకు తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ఈ సీజన్ లో పరీక్షలు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 12 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఈ ప్రకటన విడుదలైంది. కేవలం పదో తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతుంటడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి పరిశీలిద్దాం..
దేశంలోని వివిధ పోస్టాఫీసుల్లో 12828 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల కోసం పోస్టల్ శాఖ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ సర్కిళ్ల పరిధిలోని పోస్టాఫీసుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. కేవలం పదో తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే పోస్టాఫీసుల్లో బ్రాంచ్ పోస్టుమాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లుగా ఉద్యోగాలు పొందవచ్చు. ఇవాళ విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టి నుంచి జూన్ 11 లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అర్హతల్ని పరిశీలిస్తే కేవలం పదో తరగతి పాసై ఉంటే సరిపోతుంది. అయితే పదో తరగతిని గణితం, ఇంగ్లీష్ తో పాటు స్ధానిక భాష (తెలుగు లేదా ఇతర స్ధానిక భాష) తో పాసై ఉండాలి. అలాగే వీరికి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం తప్పనిసరిగా పేర్కొన్నారు. అలాగే జూన్ 11 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఇస్తారు.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి 29380 వరకూ వేతన స్కేలు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24470 వరకూ వేతనం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ విమెన్ లు మినహాయించి మిగిలిన వారు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సర్కిళ్ల వారీగా ఖాళీలు చూసుకుంటే ఏపీలో 118, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎలాంటి పరీక్ష ఉండదు. కేవలం పదో తరగతిలో మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తారు.












Click it and Unblock the Notifications