రేపట్నుంచే ఎస్ఐ తుది పరీక్ష: 2 గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలన్న డీజీపీ
హైదరాబాద్: రేపట్నుంచి అంటే ఏప్రిల్ 8 నుంచి ఎస్ఐ పోస్టుల కోసం తుది పరీక్షలు జరగనున్న క్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేశారు. ఏప్రిల్ 8,9 తేదీల్లో ఎస్ఐ పోస్టులకు తుది పరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(TSLPRB) అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏప్రిల్ 8న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో పరీక్ష రాసే అభ్యర్థులు.. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా రెండు గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు.
ప్రధాని రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ ఆంక్షలతో దాదాపు అన్ని రహదారులు బిజీగా ఉండే అవకాశం ఉన్నందన తమ పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే వెళ్లేలా అభ్యర్థులు ప్లాన్ చేసుకోవాలని డీజీపీ సూచించారు. ట్రాఫిక్ పోలీసులకు, ఎస్ఐ అభ్యర్థులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
కాగా, ఏప్రిల్ 8, 9వ తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ప్రక్రియ పూర్తయింది. పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సూచించారు. హాల్‌టికెట్లపై అభ్యర్థులు తప్పనిసరిగా ఫొటో అతికించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో పరీక్షలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications