సిమ్లా వీధుల్లో భారీ తిరంగా రెపరెపలు
ఇంకొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోబోతోన్నాం. ఇవి.. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఈ నెల 15వ తేదీన శనివారం నాడు దేశ రాజధానిలోని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ప్రకటనలను చేసే అవకాశాలు లేకపోలేదు. గత ఏడాది ఇండిపెండెన్స్ డే నాడు జీఎస్టీ రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ వేడుకల ముందస్తు సన్నద్ధతలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ మధ్యాహ్నం తిరంగా యాత్ర అత్యంత వైభవంగా జరిగింది. బీజేపీ రాష్ట్రశాఖ దీన్ని నిర్వహించింది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దీనికి నేతృత్వం వహించారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

సిమ్లాలోని సీటీఓ జంక్షన్ వద్ద ఈ తిరంగా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అక్కడి నుంచి షేర్ ఎ పంజాబ్ మీదుగా మాల్ రోడ్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ ర్యాలీలో స్థానికులతో పాటు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతపట్టి వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. వారి నినాదాలతో సిమ్లా వీధులన్నీ మార్మోగాయి.
ఈ సందర్భంగా జైరామ్ ఠాకూర్ మాట్లాడారు. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి ఒక మహోత్సవం లాంటిదని అభివర్ణించారు. ఎందరో దేశభక్తులు, అమరవీరుల త్యాగాల పునాదులపైనే దేశం బలంగా నిర్మితమైందని ఈ తిరంగా యాత్ర ద్వారా యువతలో జాతీయవాదాన్ని మళ్లీ మేల్కొలపడంతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలనే దృఢ సంకల్పం ఏర్పడుతుందని జైరామ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
సిమ్లా లోక్‌సభ సభ్యుడు సురేష్ కశ్యప్ మాట్లాడుతూ.. జాతీయ జెండా అనేది దేశ పౌరుల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారతీయులందరి మధ్య పరస్పర సోదరభావాన్ని, జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ఈ తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ తరఫున తిరంగా కార్యకలాపాలను నిర్వహించాలని పార్టీ హైకమాండ్ సూచించిందని వివరించారు.




Click it and Unblock the Notifications