79 ఏళ్లకు బస్సు భాగ్యం: తరం మారినా తీరని కల నెరవేరిన వేళ
ప్రతిరోజూ మనకు కనిపించే ఒక సాధారణ ప్రభుత్వ బస్సు, ఆ గ్రామానికి మాత్రం ఒక సరికొత్త వెలుగును తెచ్చిపెట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 79 ఏళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ రవాణా సౌకర్యానికి నోచుకోని ఆ మారుమూల పల్లెలోకి తొలిసారిగా ఆర్టీసీ చక్రం అడుగేసింది. రాజస్థాన్‌లోని కేక్రి ప్రాంతానికి చెందిన 'కుర్తాల్' గ్రామానికి రాజస్థాన్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన తొలి బస్సు చేరుకోవడంతో ఊరంతా ఒక్కసారిగా పండగ వాతావరణం సంతరించుకుంది. జనం బస్సుపై పూలవర్షం కురిపిస్తూ, ఆనందభాష్పాలతో ఆ బస్సుకు స్వాగతం పలికారు.

మేళతాళాలు, హారతులతో గ్రాండ్ వెల్‌కమ్
ఎన్నో దశాబ్దాల నిరీక్షణ ఫలించి ఊరి ముంగిటకు బస్సు రాగానే గ్రామస్తుల ఆనందానికి హద్దులు లేవు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామ సరిహద్దు నుంచి ఊరి మధ్య వరకు పల్లె జనం రోడ్డు ఇరువైపులా నిలబడి పూలు జల్లారు. మహిళలు హారతులతో దిష్టి తీయగా, యువకులు డప్పు చప్పుళ్లకు నాట్యాలు చేశారు. బస్సును నడిపిన డ్రైవర్, కండక్టర్లను రాజస్థానీ సంప్రదాయం ప్రకారం తలపాగాలు చుట్టి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
దశాబ్దాల రవాణా కష్టాలకు చెక్
కుర్తాల్‌తో పాటు దాని పొరుగున ఉన్న 'కేరోట్' గ్రామం కూడా ఇన్నాళ్లూ ప్రభుత్వ రవాణా వ్యవస్థకు ఆమడ దూరంలోనే ఉంది. ఇప్పటివరకు అత్యవసర పనులకు, దవాఖానాలకు, పాఠశాలలకు లేదా మార్కెట్లకు వెళ్లాలంటే సొంత వాహనాలు ఉండాలి, లేదా మైళ్ల కొద్దీ నడిచి ప్రధాన రహదారికి చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వ బస్సు నేరుగా తమ గ్రామానికే రావడంతో విద్యార్థులకు, ఆసుపత్రులకు వెళ్లే వృద్ధులకు రవాణా కష్టాలు తప్పినట్లయింది.
ఇది దశాబ్దాల హక్కు... సోషల్ మీడియాలో భిన్న స్పందనలు
గ్రామస్తుల అమాయకమైన ఆనందం, సంబరాలకు సంబంధించిన వీడియోలు చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఒకవైపు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని స్వాగతిస్తూనే, మరొకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశంలో ఒక చిన్న బస్సు రావడానికి ఎనిమిది దశాబ్దాలు పట్టడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇవి ప్రజలకు దక్కాల్సిన కనీస హక్కులని, దీనికోసం ఇన్ని ఏళ్లు ఎదురుచూసేలా చేయడం పట్ల ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ పల్లె ప్రజలకు మాత్రం ఈ బస్సు రాక సరికొత్త ఆశలను మోసుకొచ్చింది.




Click it and Unblock the Notifications