మరో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ: ఏ శాఖలో అంటే?
హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు విభాగాల్లో ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అందజేశారు.
మొత్తం 40 విభాగాల్లో, 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏప్రిల్ 30వ తేదీన ఉత్తర్వులు విడుదలైన విషయం తెలిసిందే. నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ తన చాంబర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై సంతకం చేశారు. దీంతో ఆయా విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఆయా శాఖలు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఉన్నత విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే.

ఇది ఇలావుండగా, పది రోజుల్లో నిమ్స్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన టెండర్ పనులను పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ పని తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని హరీశ్ రావు అధికారులకు స్ఫష్టం చేశారు. వరంగల్ హెల్త్ సిటీని దసరా నాటికి ప్రారంభించుకునేందుకు వీలుగా సిద్ధం చేయాలన్నారు.
సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను విస్తరించుకునేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. నిమ్స్ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించే 2000 పడకల బిల్డింగ్కు పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.












Click it and Unblock the Notifications