MPhil: ఎంఫిల్ కు గుర్తింపు లేదు, అడ్మిషన్లన్నీ రద్దు-వర్సిటీలకు యూజీసీ కీలక ఆదేశం..
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న ఎంఫిల్ డిగ్రీ ప్రోగ్రామ్ లను నిలిపేయాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని వర్శిటీలకు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఎంఫిల్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లను నిలిపివేయాలని యూనివర్సిటీలను సూచించింది. ఎంఫిల్ డిగ్రీ గుర్తింపు పొందిన డిగ్రీ కాదని, అందుకే ఈ కోర్సులో ప్రవేశాలను నిలిపివేయాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
గతేడాది ఎంఫిల్ ప్రోగ్రామ్ ను నిలిపివేస్తున్నట్లు యూజీసీ గతంలోనే ప్రకటించింది. నవంబర్ 7, 2022న ఎంఫిల్ డిగ్రీ కనీస ప్రమాణాలు, పీహెచ్‌డీ డిగ్రీకి సంబంధించిన విధానాలు కూడా విడుదల చేసింది. సవరించిన పీహెచ్‌డీ అర్హత ప్రమాణాల ప్రకారంకనీసం 75 శాతం మార్కులతో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు లేదా దాని సమానమైన గ్రేడ్ సాధించిన వారు మాత్రమే పీహెచ్‌డీకి అర్హత పొందుతారు.

కాబట్టి2023-24 విద్యా సంవత్సరానికి ఎంఫిల్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లను నిలిపివేయడానికి విశ్వవిద్యాలయ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని యూజీసీ తెలిపింది. అలాగే విద్యార్థులకు కూడా ఎంఫిల్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ తీసుకోవద్దని సూచించింది. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు ఇంకా ఎంఫిల్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషన్ గుర్తించింది. దీంతో తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) ప్రోగ్రామ్ కోసం కొన్ని విశ్వవిద్యాలయాలు తాజాగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో ఎంఫిల్ డిగ్రీ గుర్తింపు పొందిన డిగ్రీ కాదనే విషయాన్ని స్పష్టం చేయాలని యూజీసీ ఓ ప్రకటనలో సూచించింది.












Click it and Unblock the Notifications