స్టార్ హీరో మూవీ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం- సెట్ బుగ్గి
Dhanush Idli Kadai: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న కొత్త చిత్రం.. ఇడ్లీ కడై. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాలుగో మూవీ. డాన్ పిక్చర్స్ బ్యానర్ కింద ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఆయన సరసన నిత్యా మీనన్ నటిస్తోన్నారు.
అరుణ్ విజయ్, సత్యరాజ్, పార్తీబన్, షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, సముద్రఖని, రాజ్‌కిరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తోన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. తేని, పొల్లాచ్చి వంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించినప్పటికీ- సాధ్యపడలేదు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని మార్చారు. అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది.
ప్రస్తుతం థేని జిల్లాలోని ఆండిపట్టీలో సెట్స్ మధ్య షూటింగ్ జరుగుతోంది. 20 రోజులుగా ఇక్కడే చిత్రీకరణ జరుపుకొంటోంది. కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తోంది యూనిట్. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ పరిస్థితుల మధ్య అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

ఈ మూవీ సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలను చిత్రీకరించడానికి వేసిన సెట్ అది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలు త్వరగా వ్యాపించడానికి దోహదపడే పరికరాలు, చెక్క వస్తువులు, కొన్ని రసాయనాలు, పెయింట్, ఫ్లెక్సీలు, బ్యానర్లు సంఘటన స్థలంలో ఉండటం వల్ల అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. మంటల తీవ్రత అమాంతం పెరగింది.
గంటన్నర పాటు సెట్ మొత్తం కూడా తగులబడటం కనిపించింది. ఆ సమయంలో ధనుష్ సహా ఇతర నటీనటులెవ్వరూ అక్కడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. అప్పటికే సెట్స్ 60 శాతం వరకు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరావట్లేదు.












Click it and Unblock the Notifications