చిరంజీవి వద్దన్న కథతో సినిమా చేసి స్టార్ హీరో అయిన విలన్
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చాలా బిజీగా ఉన్న తరుణంలో ఆయన వద్దకు ఎన్నో కథలు వచ్చాయి. అయితే కాల్షీట్లు ఖాళీలేక, మరికొన్ని కథలు నచ్చక సినిమాలు చేయలేదు. అలాగే దర్శకుడు బి.గోపాల్ చిరుతో సినిమా చేయాలని ఆయనకు ఒక కథ వినిపించారు. కచ్చితంగా హిట్ అవుతుందనే భరోసా కల్పించారు. అయితే అది రాజకీయ కథాంశంతో ముడిపడినట్లుగా ఉండటంతో చిరంజీవి ఆ సినిమా చేయడానికి వెనకాడారు. చేయాలా? వద్దా? అనే విషయం చెప్పడానికి చాలా సమయం తీసుకున్నారు. ఆ సమయంలో బి.గోపాల్ తో సినిమా అంటే భారీ హిట్ కింద లెక్క.
తన సొంత బ్యానరుపై నిర్మించారు
చివరకు మెగాస్టార్ చేయననడంతో బి.గోపాల్ ఆ కథను మోహన్ బాబుకు వినిపించారు. అది ఆయనకు బాగా నచ్చింది. తమిళంలో వచ్చిన మంచి హిట్ అయిన వేలై కీడై చుడుచు సినిమాకు రీమేక్. ఏపీకి తగినట్లుగా కొన్ని మార్పుచేర్పులు దర్శకుడు చేయించారు. మోహన్ బాబు అప్పటికే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడుగారు సినిమా చేసి సోలో హీరోగా సూపర్ హిట్ కొట్టారు. వెంటనే ఈ సినిమాను కూడా గోపాల్ దర్శకత్వంలో తన సొంత బ్యానరు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించి బ్లాక్ బస్టర్ సాధించారు. ఆ సినిమానే అసెంబ్లీ రౌడీ. దివ్యభారతి హీరోయిన్ గా నటించగా, జగ్గయ్య, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లారు
ఈ సినిమా తర్వాత రౌడీగారిపెళ్లాం, బ్రహ్మ, డిటెక్టివ్ నారద, పెదరాయుడు తదితర సినిమాలు చేసి చివరకు చిరంజీవికే పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లిపోయారు మోహన్ బాబు. అప్పటివరకు ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా పలు పాత్రలు పోషించిన మోహన్ బాబు చిరంజీవితో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో వీరిద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. సెలబ్రిటీల కిందకు తాను రానా? తనకు అవార్డు ఎందుకు ఇవ్వరు? అని మోహన్ బాబు ప్రశ్నించడంతో చివరకు చిరంజీవి కూడా తనకు ఇవ్వాలనుకున్న అవార్డును వద్దనుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య కొంత సఖ్యత ఏర్పడింది. అయినప్పటికీ పైకి కనిపించని విభేదాలు లోలోన రగులుతూనే ఉంటాయి.












Click it and Unblock the Notifications