మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా: సెక్సువల్ కంటెంట్‌పై ఫైర్: టైం ఇచ్చిన మంచు విష్ణు
Manchu Vishnu: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో ప్రసారమౌతోన్న సెక్సువల్ కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. యూట్యూబ్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.
యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సెక్సువల్, అసభ్య, అభ్యంతర కంటెంట్‌తో కూడిన కథనాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలుగువారి నైజం కాదని అన్నారు. తెలుగు సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోన్నారంటూ మండిపడ్డారు. తన దృష్టికి వచ్చిన కొన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో వస్తోన్న కథనాలను చూడగా.. అత్యంత జుగుప్సాకరంగా ఉంటోన్నాయని అన్నారు. వాటి గురించి మాట్లాడుతుంటేనే ఒళ్లు జలదిస్తోందని పేర్కొన్నారు.

వీటిని నియంత్రించడానికి ఇటీవలే తన తోటి నటుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని మంచు విష్ణు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు.
మహిళను కేవలం సెక్సువల్‌గా మాత్రమే చూస్తోన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు. మీ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతుళ్లు లేరా.. అంటూ ప్రశ్నించారు. మహిళను గౌరవించనప్పుడు మనిషిగా బతికి వేస్ట్.. అని అన్నారు.
తన ఫొటోలు, వీడియోలను జుగుప్సాకరమైన కంటెంట్‌లో వినియోగిస్తోన్నారంటూ బ్రహ్మానందం సైతం తనకు ఫోన్ చేసి ఆవేదన పడ్డారని మంచు విష్ణు తెలిపారు. దీనికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. హీరోయిన్లను అసభ్యకరంగా తమ కథనాల కోసం వాడుకుంటోన్నారని చెప్పారు.

సెక్సువల్ కంటెంట్‌తో ఉన్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ తనకు ప్రతీరోజూ హీరో, హీరోయిన్లు, నటీనటులు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని మంచు విష్ణు తెలిపారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరంగా చర్యలు తీసుకోదలచుకున్నానని అన్నారు.
ఇలాంటి సెక్సువల్ కంటెంట్‌ను యూట్యూబ్ ఛానళ్లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించడానికి 48 గంటలు సమయం ఇస్తోన్నానని మంచు విష్ణు తెలిపారు. అప్పట్లోగా వాటిని తొలగించకపోతే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామనీ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications