ఆ సీన్ చేసేటప్పుడు చచ్చిపోయా అనుకున్నా - స్టార్ హీరో
టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, స్పెషల్ రోల్స్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు జగపతిబాబు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.
పేరు మార్పు..
చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగపతి బాబు తన పేరు వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని చెప్పారు. తన పేరు జగపతి రావు అని కానీ ఇండస్ట్రీలో రావులు ఎక్కువగా ఉన్నారని బాబుగా మార్చేశారని చెప్పారు. ఆ తర్వాత జగ్గూభాయ్‌గా మారిపోయానని సరదాగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తన లుక్ గురించి కూడా ఓపెన్ అయ్యారు. కొంతమంది తనకు జుట్టు తెల్లబడిందని రంగు వేసుకోమని సలహా ఇస్తున్నారని.. కానీ అసలు ఇప్పటికీ జుట్టు ఉండటం అదృష్టంగా అనిపిస్తుందని తెలిపారు. సహజంగానే తెల్లబడింది కాబట్టి అలాగే వదిలేశానని.. ఏది అయినా సహజంగా ఉంటేనే బాగుంటుందని భావిస్తానన్నారు.

'అంత:పురం' క్లైమాక్స్‌లో చనిపోయా అనుకున్నా..
తన కెరీర్‌లో మరిచిపోలేని అనుభవం గురించి కూడా ఆయన వివరించారు. అంత:పురం సినిమా చివరి సీన్‌లో తాను చచ్చిపోయానని అనుకున్నానని.. ఎందుకంటే డైరెక్టర్ కృష్ణవంశీ ఆ సీన్‌లో అంతగా లీనమైపోయి కట్ చెప్పలేదని సీక్రెట్ రివీల్ చేశారు. కాసేపు తాను నిజంగానే పోయానేమో అనిపించిందని.. కెరీర్ మొత్తంలో తనకు ఫేవరెట్ షాట్ అదే అని గుర్తుచేసుకున్నారు. ఇక తన జీవితంలో పెద్దగా కోరికలేం లేవని.. చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని అన్నారు.
ఇక 1989లో వచ్చిన "సింహాసనం" సినిమాతో జగపతిబాబు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1990లలో ఫ్యామిలీ ఎమోషన్లతో నిండిన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. సీతారామయ్య గారి మనవరాలు, మావిచెట్టు, పెళ్లి, వంటి చిత్రాలు ఆయన నటుడిని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. అలానే శుభలగ్నం, శుభమస్తు, పెళ్లికానుక, అంతఃపురం వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను పీక్స్ కు తీసుకెళ్లాయి.
2014లో వచ్చిన ''లెజెండ్'' సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. రంగస్థలం, నాన్నకు ప్రేమతో, సైరా నరసింహారెడ్డి, సలార్, అఖండ, రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న "పెద్ది" మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications