పల్నాడులో దారుణం.. ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య !!
ఏపీ లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. ఈ దారుణ ఘటన స్థానికం గానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..
విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన నక్కా భారతి (24) అనే మహిళకు సునీల్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తేజేష్‌రెడ్డి (6), హేమనాథ నాగి రెడ్డి (4) ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ముందుగా ఇద్దరు చిన్నారులను హత్య చేసిన భారతి అనంతరం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, హత్యకు ఉపయోగించిన విధానం ఏమిటి అనే విషయాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటనను గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. ఈ విషాద ఘటన వెనుక కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ఏదైనా సూసైడ్ నోట్ రాసి ఉంచిందా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
ఒక తల్లి తన సొంత పిల్లలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications