రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోన్న నాగచైతన్య ట్వీట్
అక్కినేని నాగచైతన్య పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా నానుతోంది. అతనొక్కడిదే కాకుండా తండ్రి నాగార్జున, మాజీ భార్య సమంత పేర్లు కూడా కొద్దిరోజులుగా వైరలవుతున్నాయి. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ అదుపు తప్పి నాగార్జున కుటుంబాన్ని, సమంత, నాగచైతన్యను అందులోకి లాగారు. తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సమంతకు క్షమాపణలు తెలిపారు. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం నాగార్జునకు మద్దతు తెలియజేసింది.
100 బిట్ కాయిన్ల కొనుగోలు
కొండా సురేఖ పై నాంపల్లి కోర్టులో నాగార్జున రూ.100 కోట్లకు పరువు నష్టందావా వేశారు. దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశ్రమ పెద్దలను కోరారు. ఇలా వివాదం నెమ్మదిగా సద్దుమణుగుతోంది. ఇటువంటి తరుణంలో నాగచైతన్య ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే తాను 2013లో 50 డాలర్లకు 100 బిట్ కాయిన్లను కొనుగోలు చేశానని, ప్రస్తుతం దాని విలువ ఆరు మిలియన్ డాలర్లు అయిందని, వాటిని ఇతరులకు పంచడంపై మీ అభిప్రాయం తెలియజేయాలని, ఓటు వేయాలని కోరారు.

పోస్టును తొలగించిన నాగచైతన్య టీం
దీంతో నెటిజన్లు నాగచైతన్య ట్విటర్ ఖాతా హ్యాక్ అయిందని భావించారు. వెంటనే ఈ విషయం తెలియడంతో నాగచైతన్య టీం స్పందించి ఆ పోస్టును తొలగించింది. అయితే అప్పటికే చాలామంది పోల్ లో పాల్గొనడంతోపాటు తమకు కావాలంటూ పోస్టులు పెట్టారు. ప్రస్తుతం బన్నీ వాసు నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై నాగచైతన్య తండేల్ సినిమా చేస్తున్నారు. దీనికి చందు మొండేటి దర్శకుడు. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications