అల్లు అర్జున్ కోసం విశాఖలో..!!
AAA Cinemas: సాగర నగరం విశాఖపట్నంలో మరో ప్రాజెక్ట్ రాబోతోంది. ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్ (AAA Cinemas) మల్టీప్లెక్స్ నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఈ మల్టీప్లెక్స్.. విశాఖపట్నంలో అడుగు పెట్టబోతోంది.
దీని నిర్మాణానికి ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ భూమిపూజ చేశారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ చౌదరి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇందులో పాల్గొన్నారు. విశాఖపట్నం కైలాసపురంలో రూపుదిద్దుకుంటోన్న ఇనార్బిట్ మాల్ లో ఏఏఏ సినిమాస్ నిర్మితం కానుంది.

మొత్తం ఎనిమిది స్క్రీన్లు ఇందులో ఉంటాయి. 2026 వేసవి సీజన్ నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని తరువాత క్రమంగా మిగిలిన నగరాలకు కూడా ఏఏఏ సినిమాస్ విస్తరించే అవకాశాలు లేకపోలేదు. విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ఈ మల్టీప్లెక్స్ లు నిర్మితం కావొచ్చు.
ఇదివరకు ఆసియన్ థియేటర్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు కొలాబరేట్ అయిన విషయం తెలిసిందే. ఏఎంబీ పేరుతో మహేష్ బాబు మల్టీ చెయిన్ థియేటర్లను నిర్మిస్తోన్నారు. ఇప్పుడు తాజాగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. ఆసియన్ థియేటర్స్ యాజమాన్యంతో చేతులు కలిపారు.
2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ కు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ దీన్ని నిర్మిస్తోంది. 17 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోతోంది ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్.
మొత్తం 600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది రహేజా గ్రూప్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇనార్బిట్ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలద్, వసై, నవీ ముంబై, వడోదర.. వంటి నగరాల్లో ఇవి నిర్మితం అయ్యాయి. విశాఖపట్నం కూడా ఆయా నగరాల జాబితాలో చేరనుంది.












Click it and Unblock the Notifications