ఎన్ని చెప్పినా ఆయన మారడయ్యా... అంతే!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. భారతదేశ సినీ చరిత్రలో అతి పెద్ద విజయాలు సాధించిన సినిమాల జాబితాలో పుష్ప2 కూడా చోటు సంపాదించుకుంది. అందుకు దర్శకుడు సుకుమార్ కృషితోపాటు అల్లు అర్జున్ కష్టం కూడా ఉంది. నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకపోవడం, దేవిశ్రీప్రసాద్ పాటలు, కెమెరా.. అద్భుతమైన నటన కనపరిచిన ఇతర నటీనటులంతా కలిసి పుష్ప2ను అతి పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు.
అభిమానులు ఆవేదన చెందారు
ఈ సినిమా రూ.1800కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. దక్షిణ భారతదేశంలోకన్నా హిందీలో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. బన్నీ క్యారెక్టర్ ను సుకుమార్ తీర్చిదిద్దిన విధానం వారిని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రీమియర్ షో హైదరాబాద్ సంధ్య థియేటర్ లో వేసే సమయంలో తొక్కిసలాట జరగడం, మహిళ మృతిచెందడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతుండటం, తర్వాత బన్నీ అరెస్ట్ అవడం, బెయిల్ పై బయటకు రావడంలాంటివన్నీ జరిగిపోయాయి. దీంతో పుష్ప2 అందించిన ఘనవిజయాన్ని ఆస్వాదించలేని స్థితిలో బన్నీ ఉన్నాడంటూ అభిమానులు ఆవేదన చెందారు.

చాలా ఆలస్యంగా జరిగిన వేడుక... ఆయన మారడు
తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్మాతలు హైదరాబాద్ లో నిర్వహించారు. అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవడంతో పుష్ప2కు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు వారు చేపట్టలేదు. కొంత సమయం తీసుకొని ఇప్పుడు సక్సెస్ మీట్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాటలు విన్న తర్వాత అందరూ అతను ఎప్పటికీ మారడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకురావడం అనేది కొన్నాళ్ల నుంచే బన్నీ ఆపేశాడు. తాజాగా సక్సెస్ మీట్ లో తనకున్న ఆర్మీ ప్రస్తావన తీసుకొచ్చాడు. అల వైకుంఠపురం సినిమా వేడుకలో మాట్లాడుతూ బన్నీ నాకంటూ ఓ ఆర్మీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ ఆర్మీ చేసే ప్రచారం, చేస్తున్న ప్రచారం గురించి తెలుగు ఫిలిం నగర్ లో అందరికీ తెలుసు. మళ్లీ ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఆర్మీ ప్రస్తావన తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. కనీసం ఇప్పుడైనా మారాడనుకుంటే ఎందుకు అనవసరంగా ఆర్మీ ప్రస్తావన తెస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications