ఓటీటీలోకి 'పుష్ప2'... ఎప్పటినుంచంటే?
మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై యర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్, సుకుమార్ రైటింగ్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మించిన భారీ చిత్రరాజం పుష్ప2. ఈనెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను కొల్లగొడుతోంది. తెలుగులో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. రెండోవారంలో కూడా రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ హిందీ సినిమా రెండో వారంలో రూ.100 కోట్లు రాబట్టలేదు. దీన్నిబట్టి ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే వారంతా తమవాడు అనుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు లేవు
దేశవ్యాప్తంగా తిరిగి ప్రమోషన్స్ చేద్దామనుకుంటున్న తరుణంలో మహిళ మృతితో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావల్సి వచ్చింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీదేవి మంజూరు చేశారు. ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే బెయిల్ ఇవ్వడానికి మరో కేసును జడ్జి ఉదాహరణగా ఆర్నాబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. క్వాష్ పిటిషన్ లో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చన్నారు. వివాదం ఇలా కొనసాగుతుండగా మరోవైపు పుష్ప2 కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడంలేదు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే అవుతుంది. అందుకు కారణం టికెట్ ధరలు.

జనవరి 9వ తేదీ నుంచి
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. 2025 జనవరి 9వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే నిర్మాతల నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. నెట్ ఫ్లిక్స్ చాలా దూకుడుగా ఉంది. దాదాపుగా ఈ సంవత్సరం విడుదలైన అన్ని హిట్ సినిమాల హక్కులను ఈ సంస్థే దక్కించుకుంది. పుష్ప2 కూడా ఓటీటీలో ప్రసారమైతే అత్యధిక వ్యూస్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లక్కీ భాస్కర్, దేవర చిత్రాలు వ్యూస్ ను దక్కించుకున్నాయి. పుష్ప2 ప్రసారమైతే వీటి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications