మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందారు మెగాస్టార్ "ముమ్ముట్టి". నాలుగు దశాబ్దాలుగా తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఆయన మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసి విశేష గుర్తింపు పొందారు. వివిధ రకాల పాత్రల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మమ్ముట్టి భారతీయ సినీ రంగంలో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒకరిగా నిలిచారు.
నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన అనేక సినిమాలను నిర్మించారు. తన కెరీర్‌లో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు సైతం అందుకున్నారు. అయితే మమ్ముట్టికి ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..
మమ్ముట్టి కేరళలోని Wayanad ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస టౌన్‌షిప్‌ను సందర్శించారు. ఈ పర్యటనను ఆయన పూర్తిగా వ్యక్తిగతంగా, ఎలాంటి రాజకీయ రంగు లేకుండా నిర్వహించాలనుకున్నారు. దాంతో చెన్నై నుంచి నేరుగా అక్కడికి చేరుకున్న ఆయన చాలా సాదాసీదాగా పర్యటన ముగించాలని భావించారు. అయితే ఈ పర్యటన సమయంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె. రఫీక్ ఆయనతో పాటు ఉండటం వివాదానికి దారితీసింది. మమ్ముట్టి తన సందర్శన రాజకీయంగా కనిపించకూడదని భావించి రఫీక్‌ను కొంత దూరంగా ఉండాలని వినయంగా కోరారు. "నువ్వు నా పక్కనే ఉంటే నేను నీ కోసమే వచ్చానని జనం అనుకుంటారు" అని ఆయన చెప్పినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు.
సోషల్ మీడియాలో విమర్శలు..
ఈ సంభాషణను అక్కడ ఉన్న హిడెన్ కెమెరాలు రికార్డ్ చేశాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు సీపీఎం అనుకూల సైబర్ కార్యకర్తలు మమ్ముట్టిపై విమర్శలు గుప్పించారు. కొందరు తీవ్ర స్థాయిలో దుర్భాషలతో వ్యాఖ్యలు చేయడంతో ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో కలత చెందిన మమ్ముట్టి నేరుగా కె. రఫీక్‌కు ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం రఫీక్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరారు.
సీఎం పినరయి విజయన్ స్పందన..
ఈ వివాదం తీవ్రంగా మారడంతో కేరళ ముఖ్యమంత్రి Pinarayi Vijayan స్వయంగా స్పందించారు. మమ్ముట్టి పర్యటన పూర్తిగా వయనాడ్ ప్రజల మేలు కోసమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మమ్ముట్టి లాంటి గొప్ప నటుడిపై సోషల్ మీడియాలో దాడులు జరగడం దురదృష్టకరమని సీఎం అన్నారు. "కేరళ గౌరవాన్ని పెంచే వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయనను బాధపెట్టి ఉంటే ముఖ్యమంత్రిగా నేను బహిరంగంగా క్షమాపణ కోరుతున్నాను" అని పినరయి విజయన్ ప్రకటించారు.
కాగా రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రజలందరూ గౌరవించే వ్యక్తి మమ్ముట్టి అని సీఎం స్పష్టం చేశారు. ఆయనపై జరిగిన సైబర్ దాడులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ప్రస్తుతం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications