చిరంజీవి, ఖుష్బూ, త్రిషపై పరువునష్టం దావా వేసిన మన్సూర్ అలీఖాన్ కు కోర్టు మొట్టికాయలు
సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ దీనిపై సినీ వర్గాలలోను, ప్రజలలోనూ చర్చకు కారణమైన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో తన పరువుకు నష్టం కలిగిందని చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేసి కోర్టు మెట్లు ఎక్కిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టులో మన్సూర్ అలీఖాన్ వేసిన పరువు నష్టం దావా పై విచారణ జరిగింది.
ఈ విచారణలో కోర్టు మన్సూర్ అలీ ఖాన్ కు మొట్టికాయలు వేసింది. బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటయిపోయింది అని వ్యాఖ్యానించిన హైకోర్టు ధర్మాసనం ప్రతిసారి వివాదాన్ని రేకెత్తించి ఆ తర్వాత నేను అమాయకుడిని అని చెప్పడం పరిపాటిగా మారిందని హైకోర్టు ధర్మాసనం ఆయనకు అక్షింతలు వేసింది.

సమాజంలో ఏ విధంగా మెలగాలో నేర్చుకోవాలని క్లాస్ పీకిన హైకోర్టు ధర్మాసనం, మన్సూర్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ ను తప్పు పట్టింది. ఇదే సమయంలో మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యల అన్ కట్ వీడియోను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మన్సూర్ అలీఖాన్ వేసిన పరువు నష్టం దావా కేసులో త్రిష, ఖుష్బూ, చిరంజీవిల వాదనలు సమర్పించాలని ఆదేశించింది.
మళ్లీ ఈ కేసు పై డిసెంబర్ 22వ తేదీన విచారించనున్నట్టు కోర్టు ధర్మాసనం పేర్కొంది. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ లియో చిత్రం గురించి మాట్లాడుతూ, లియో చిత్రంలో నేను చేసే సన్నివేశాలలో ఒక సన్నివేశం కూడా త్రిషతో చేయలేదని, ఒక బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నానన్నారు.
అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్ రూమ్ కి తీసుకు వెళ్లవచ్చని అనుకున్నానని, కానీ అలా జరగలేదన్నారు. ఇంతకుముందు చాలా సినిమాలలో తాను రేప్ సీన్లు చేశానని, కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదు అంటూ మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలే ఆయనపై చిరంజీవి, ఖుష్బూ తదితరులు తీవ్రంగా స్పందించేలా చేశాయి.












Click it and Unblock the Notifications