కీలక మలుపు తిరిగిన ధనుష్ - నయనతార వివాదం
తమిళ స్టార్ హీరో ధనుష్, స్టార్ హీరోయిన్ నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార-విఘ్నేష్ శివన్ వివాహంతోపాటు నయనతార జీవిత విశేషాలకు సంబంధించిన అన్ని వివరాలను నయనతార బియాండ్ ద ఫెయిరీటేల్ పేరుతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసాదరం చేసింది. అయితే ఇందులో ధనుష్ నిర్మాతగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని విజువల్స్ ను వాడుకున్నారు. ఈ విజువల్స్ లో నయనతార, విఘ్నేష్ శివన్ ఉంటారు. ఈ సినిమా నుంచే వీరిమధ్య పరిచయమై, తర్వాత స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్
తాను నిర్మించిన సినిమాలోని దృశ్యాలను తన అనుమతి లేకుండా వాడుకోవడంపై ఇప్పటికే ధనుష్ నయనతారను పరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశారని నయనతార తీవ్రంగా విమర్శించింది. బహిరంగ లేఖ రాస్తూ ధనుష్ పై విరుచుకుపడింది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ధనుష్.. నయనతార, విఘ్నేష్ శివన్ తోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ధర్మాసనం దీన్ని బుధవారం విచారణకు స్వీకరించింది. డాక్యుమెంటరీ ట్రైలర్ లో మూడు సెకన్ల విజువల్స్ వాడుకున్నందుకు ధనుష్ రూ.10 కోట్ల పరిహారం కోరారంటూ నయనతార అతని తీరును తీవ్రంగా తప్పుపట్టింది.

కేసు ధనుష్ కే అనుకూలంగా మారే అవకాశం
నయనతార సినీ కెరీర్, కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాలు, విజయాలు, విఘ్నేష్ శివన్ తో పెళ్లి తదితర విషయాలతో బియాండ్ ద ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ రూపొందింది. ఇందులో ప్రధానంగా విఘ్నేష్ శివన్ తో ప్రేమ, పరిచయం, పెళ్లి తదితర విషయాలను చూపించారు. వీరిద్దరికి మొదటిసారిగా పరిచయం అయింది నానుమ్ రౌడీదాన్ చిత్రం నుంచే. దీనికి ధనుష్ నిర్మాత. తమ పరిచయం ఈ సినిమాతో ప్రారంభమైంది కాబట్టి దీన్ని డాక్యుమెంటరీలో చూపించాలని భావించారు. అయితే అందుకు ధనుష్ అంగీకరించలేదు. తర్వాత మీరు ఇవ్వనన్న విజువల్స్ ఇవే చూడండి అంటూ విఘ్నేష్ శివన్ వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. చివరకు ధనుష్ కోర్టు తలుపు తట్టారు. కేసు ధనుష్ కే అనుకూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications