దివ్య భారతి మళ్లీ పుడుతుందా? పండితుడి జోస్యం నిజమైందా?
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ మెరుపులా మెరిసి అతి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న నటి దివ్యభారతి. నేడు(ఏప్రిల్ 5) ఆమె 33వ వర్ధంతి. కేవలం 19 ఏళ్ల ప్రాయంలోనే 22 సినిమాలు చేసి, ఆ కాలంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా రికార్డు సృష్టించిన దివ్యభారతి మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె మరణ వార్త విన్న అభిమానులు ఇప్పటికీ ఆమెను తలుచుకుంటూనే ఉన్నారు. అయితే ఆమె కజిన్, నటి కాయనాత్ అరోరా గతంలో దివ్య భారతి పునర్జన్మ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
మరణం గురించి ముందే చెప్పిన పండితుడు..
కాయనాత్ అరోరా ఓ ఇంటర్వ్యూలో దివ్య భారతి తల్లి మీతా భారతి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. దివ్య భారతికి కేవలం 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఓ పండితుడు ఆమె జాతకాన్ని చూసి 'అల్పాయుష్షు యోగం' ఉందని చెప్పారట. ముఖ్యంగా 18 ఏళ్ల తర్వాత ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరించారు. దివ్యను కాపాడుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు ఎన్నో పూజలు, హవనాలు చేశారు. కానీ దివ్య సినిమాల్లో బిజీ అయి ముంబైకి వెళ్ళిపోవడంతో ఆ పూజలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. పండితుడు చెప్పినట్టుగానే 19 ఏళ్ల వయసులో ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

పునర్జన్మ గురించి చెప్పిన పండితుడు
దివ్య భారతి మరణం తర్వాత ఆమె తల్లి మళ్లీ అదే పండితుడిని కలిసినప్పుడు ఆయన మరో సంచలన విషయం చెప్పారట. "మీరు చెప్పింది నిజమైంది. ఇప్పుడు నేనేం చేయాలి?" అని ఆయనను తల్లి ప్రశ్నించగా.. "దివ్య భారతి మళ్లీ తిరిగి వస్తుంది.. ఆమెకు పునర్జన్మ ఉంటుంది" అని ఆ పండితుడు ధీమాగా చెప్పారట. ఈ మాటలు విన్న అభిమానులు దివ్య భారతి నిజంగానే మళ్లీ పుడుతుందా? అని ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు.
దివ్య భారతి మరణం వెనుక రహస్యం
దివ్య భారతి మరణం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. 1993 ఏప్రిల్ 5న ఆమె తన అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు కిటికీ నుంచి కిందపడి మరణించారు. ఆమె మరణాన్ని కొందరు హత్యగా భావించగా.. పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం అది ఓ ప్రమాదమని తేల్చింది. తలకి తీవ్రమైన గాయాలు కావడం, అంతర్గత రక్తస్రావం వల్ల దివ్య భారతి మరణించారని రిపోర్టులో పేర్కొన్నారు. ఆమె పడిపోయిన కిటికీకి ఎలాంటి స్టాపర్లు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు.
12 సినిమాలు.. ఒకే ఒక్క మరణం
దివ్య భారతి భర్త సాజిద్ నడియాడ్‌వాలాను, సినీ పరిశ్రమకు చెందిన పలువురిని పోలీసులు ఐదేళ్ల పాటు విచారించారు. చివరకు 1998లో దివ్య భారతి మరణం హత్య కాదు, అది కేవలం ఒక ప్రమాదమేనని అధికారికంగా కేసును మూసివేశారు. ఆమె మరణం వల్ల అప్పట్లో దాదాపు 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి, తర్వాత వాటిలో ఇతర హీరోయిన్లను తీసుకోవాల్సి వచ్చింది. ఆమె మరణించి దశాబ్దాలు గడిచినా, భారతీయ వెండితెరపై ఆమె వదిలి వెళ్లిన ముద్ర చెరగనిది.












Click it and Unblock the Notifications