అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !!
లేడీ సూపర్ స్టార్ నయనతార.. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోను నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2003లో మలయాళంలో 'మనసినక్కరే' సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టిన ఈ భామ.. 2005లో తమిళ చిత్రం 'అయ్యా' ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కాగా అదే ఏడాదిలో 'చంద్రముఖి' లో రజనీకాంత్ సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది. అటు మాస్ సినిమాలు, ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అన్నింటిలోనూ తనకంటూ ప్రత్యేకతను చూపించింది. తన 22 ఏళ్ల కెరీర్ లో తనదైన శైలిలో మెప్పించి స్టార్ హీరోల రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరికీ స్టార్‌డమ్ అనేది రాత్రికి రాత్రే రాదు అనేందుకు ఈమె కూడా ఒక ఉదాహరణగా నిలిచింది.
అయితే అగ్రతారలుగా కొనసాగుతున్న చాలామంది సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉంటాయి. ఆ స్థాయికి చేరుకోవడానికి వారు ఎన్నో ఊహించని పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. ఈ తరహా ఇన్‌స్పైరింగ్ స్టోరీనే నయనతారది కూడా. నయన్ అసలు పేరు డయానా మరియమ్ కురియన్. ఈ గ్లామరస్ స్టార్ తన కెరీర్‌ను వెండితెరపై కాకుండా బుల్లితెరపై ఒక యాంకర్‌గా మొదలుపెట్టిందన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. 'చమయం' అనే TV షోకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే తన పర్సనల్ లైఫ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం ప్రత్యేకంగా..

కెరీర్ మార్చేసిన ఒకే ఒక్క యాడ్..
కాగా బుల్లితెరపై TV షోలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ మలయాళ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ తన కొత్త సినిమా 'మనస్సినక్కరె (Manassinakkare)' కోసం ఓ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలోనే ఓ మ్యాగజైన్‌లో డయానా జ్యువెలరీ యాడ్ చూసిన అతను.. వెంటనే 'గౌరి' పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. ఆ విధంగా డయానా తన మొదటి సినిమా అవకాశాన్ని సొంతం చేసుకుంది. అలా మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు సినిమాకి రూ.20 కోట్లు వరకు తీసుకుంటుందని సమాచారం.
పర్సనల్ లైఫ్..
ఇక కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన నయన్.. 2022లో డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు (ఉయిర్, ఉలగ్) జన్మనిచ్చింది. రీసెంట్‌గా ఇకపై తనను 'లేడీ సూపర్ స్టార్' అని పిలవొద్దని, కేవలం వర్క్‌తోనే గుర్తింపు తెచ్చుకుంటానని ఫ్యాన్స్‌ను కోరి వార్తల్లో నిలిచింది. 'జవాన్'తో బాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నయన్. త్వరలో దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి ఓ భారీ మూవీలో నటించబోతోందని టాక్. కన్నడ స్టార్ యశ్‌తో 'టాక్సిక్' చిత్రం లోనూ చేస్తుంది.
ఇక తెలుగులో వెంకటేష్ సరసన 'లక్ష్మీ' చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో 'బాస్'.. ప్రభాస్‌తో 'యోగి'.. రవితేజతో 'దుబాయ్ శీను'.. వెంకటేష్‌తో 'తులసి' వంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే 2011లో బాలకృష్ణతో 'శ్రీరామరాజ్యం' అనే సినిమాలో సీతగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ పాత్రకు నంది అవార్డు సైతం గెలుచుకుంది. రానాతో 'కృష్ణం వందే జగద్గురుం', 'అనమిక' వంటి చిత్రాలలో ఆమె పాత్రలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఆ తర్వాత తెలుగులో కొంచెం గ్యాప్ తీసుకున్న నయనతార.. 2021 లో తిరిగి టాలీవుడ్‌లో మెరిసింది. బాలయ్యతో 'జై సింహా'.. మెగాస్టార్ తో 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్' వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. రీసెంట్ గానే చిరంజీవి - రావిపూడి కాంబోలో వచ్చిన " మన శంకర వరప్రసాద్ గారు " సినిమాతో హిట్ అందుకుంది. అలానే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో కలిసి 'NBK 111' సినిమాలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications