సంధ్య థియేటర్ ఘటన నుంచి 'ఎస్కేప్' అవుతున్న అల్లు అర్జున్?
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించి 'పుష్ప2' చిత్రం డిసెంబరు ఐదోతేదీన విడుదలైంది. అంతకుముందు రోజు నాలుగోతేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో వేయగా అక్కడకు అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఆయన వచ్చారని అభిమానులు తోసుకోవడంతో జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ మృతి చెందగా, ఆసుపత్రిలో ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు సాయితేజ చికిత్స పొందుతున్నాడు. నాలుగోతేదీ నుంచి చికిత్స పొందుతున్న ఆ బాలుడు ఇంతవరకు కోలుకోలేదు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత 105, 118(1) సెక్షన్ల కింద సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, 'పుష్ప2'టీంపై కేసులు నమోదు చేశారు. దీనిపై సంధ్య థియేటర్ యజమాని రేణుకాదేవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. థియేటర్ ను డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చామని, వారు షో వేసుకున్నారని, తాము కేవలం సెక్యూరిటీని కల్పించామని, బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది ప్రభుత్వమేనని, తమకు ఏం సంబంధముందని అందులో పేర్కొన్నారు.
ఎందుకు కోర్టును ఆశ్రయించాలి?
తాజాగా అల్లు అర్జున్ కూడా తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తాను రావడంవల్లే తొక్కిసలాట జరిగిందని ఆయనకు తెలుసు. అయినా బాధ్యత వహించకుండా కేసు నుంచి మినహాయించాలంటూ ఎందుకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లినప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే ఆయన ఏపీ హైకోర్టులో ఆ కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తీర్పు బన్నీకి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నారా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తుతోంది. కానీ ఆ కేసు వేరు.. ఈ కేసు వేరు. అన్ని కేసులు ఒకేలా ఉండవు. తీర్పులు ఒకేలా రావు అనే విషయం తెలుసుకోవాలి.

రేవతి మృతిలో బన్నీ పాత్ర ఉంది
బాధితులకు ఆర్థిక సహాయం అందించానని అల్లు అర్జున్ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. థియేటర్ కు ఓపెన్ టాప్ జీపులో వెళ్లడం, అక్కడ అప్పటికే భారీసంఖ్యలో అభిమానులుండటం, లోయర్ బాల్కనీలోకి వారంతా తోసుకురావడంతోనే తొక్కిసలాట జరిగిందని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాన్ష్ యాదవ్ తెలిపారు.రేవతి మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతా రాహిత్యమేకాదు ఆయన పాత్ర కచ్చితంగా ఉంది. నిందితుడిగా ఉన్నందుకు ఆయనకు ఏమైనా శిక్ష పడుతుందా? లేదంటే జరిమానాతో కోర్టు సరిపెడుతుందా? అదీ కాదంటే రెండూ ఉంటాయా? అనేది కోర్టు తేల్చాలి. న్యాయ నిపుణులు జైలు శిక్ష కన్నా జరిమానా పడే అవకాశమే ఎక్కువగా ఉంటుందంటున్నారు. అటువంటప్పుడు జరిమానా చెల్లించి, ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత బన్నీపై ఉంటుంది. తనకు రెండు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులున్నారు. ఎక్కడకు వెళ్లినా ఇలా ఓపెన్ టాప్ జీపులో రాజకీయ నాయకుడిలా చేతులు ఊపుకుంటూ వెళితే, వారంతా తోసుకోవడం, తొక్కిసలాట జరగడం అనేవి సాధారణంగా జరుగుతుంటాయి.
బాధ్యతారాహిత్యాన్ని అంగీకరించాలి
వారందరి ప్రేమను బన్నీ అంగీకరిస్తున్నట్లయితే రేవతి మృతి కేసులో తన బాధ్యతారాహిత్యాన్ని అంగీకరించాలని, అలాకాదంటే అభిమానులకు తనపై ప్రేమ ఉన్నా, తనకు మాత్రం వారిపై ప్రేమ లేదని, కేవలం డబ్బుల కోసమే తాము సినిమాలు తీయడంతోపాటు సినిమాల్లో నటిస్తున్నామనే విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పినట్లవుతుంది. నిజంగా ఆ మహిళ మరణం భర్తకు భార్యను దూరం చేసింది... ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది.. రేవతి తల్లిదండ్రులకు ఒక కూతురును దూరం చేసింది. వీటన్నింటికీ తాను కారణం అనుకుంటే క్వాష్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని అభిమానులే కోరుతున్నారు. లేదంటే తాను కూడా ఫక్తు రాజకీయ నాయకుడిలాంటివాడినేనని నిరూపించినట్లవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా కొద్దికాలంగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు కాబట్టి.












Click it and Unblock the Notifications