జపాన్ భూకంపం నుంచి తృటిలో తప్పించుకున్న జూనియర్ ఎన్టీఆర్..!!
Jr NTR: జపాన్‌లో సంభవించిన పెను భూకంపం వల్ల ఇప్పటివరకు 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కుప్పకూలిన నివాస భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
46 వేలకు పైగా నివాసాలు భూకంపం బారిన పడ్డాయి. చాలావరకు నేలమట్టం అయ్యాయి. 62,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ ఏర్పడ్డాయి. 50 వేలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీనివల్ల సహాయక చర్యల్లో జాప్యం ఏర్పడుతోంది.

ప్రధానంగా ఇషికవా ప్రీఫెక్షర్ దారుణంగా దెబ్బతిన్నది. వజీమా సిటీ అల్లకల్లోలానికి గురైంది. ఈ నగరంలోనే మెజారిటీ సంఖ్యలో నివాసాలు నేలమట్టం అయ్యాయి. నిగట, టొయొమా ప్రీఫెక్షర్స్ రీజియన్లలోని పలు ప్రాంతాలు భూకంప ప్రభావానికి గురయ్యాయి. ఇక్కడి మేజర్ పోర్ట్ సైతం ధ్వంసమైంది.
ప్రధాన భూకంపం తరువాత 24 గంటల వ్యవధిలో 54 సార్లు భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేలుపై 4కు పైగా తీవ్రతతో ఆయా భూకంపాలన్నీ నమోదు కావడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. భూకంపం తీవ్రతకు ఏర్పడ్డ సునామీ.. నష్టాన్ని మరింత పెంచింది. తీరప్రాంత నగరం వజీమా సిటీ అల్లాడిపోయింది. అయిదు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిన రాకాసి అలలు ఈ నగరాన్ని ముంచెత్తాయి.

ఈ పరిణామాలపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. జపాన్ భూకంపం, అనంతరం ఏర్పడిన సునామీ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతంలోనే తాను వారం రోజుల పాటు గడిపానని వివరించారు. ఇప్పుడే జపాన్ నుంచి ఇంటికి చేరుకున్నానని తెలిపారు.
భూకంప ప్రభావం బారిన పడ్డ ప్రాంతాల ప్రజలకు ఆయన ధైర్యవచనాలను పలికారు. ఈ విపత్తు నుంచి జపనీయులు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారాయన.












Click it and Unblock the Notifications