రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే అంటూ క్లారిటీ !
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, మహానేత నందమూరి తారకరామారావు. ఆయన తెరపై నవరస నట సార్వభౌముడిగా, రాజకీయ రంగంలో ప్రజల నాయకుడిగా నిలిచారు. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి కుటుంబం తెలుగు చిత్రపరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. బాలకృష్ణ నేటికీ సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతుండగా.. నేటి తరం వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ - గ్లోబల్ స్టార్
తనదైన శైలిలో రాణిస్తూ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR లో కొమురం భీమ్ పాత్రతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా "నాటు నాటు" పాటకు ఆస్కార్ రావడం ద్వారా ఎన్టీఆర్ పేరు గ్లోబల్ స్టార్ గా మార్మోగింది. అయితే ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గురించి పొలిటికల్ గా కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది.

మరోవైపు నందమూరి కుటుంబంలో బాబాయ్ - అబ్బాయిల మధ్య గ్యాప్ వచ్చిందని గత కొంతకాలంగా ఓపెన్ గానే డిస్కషన్ నడుస్తోంది. అప్పుడెప్పుడే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ సందర్భంగా ఈవెంట్ లో కలసి కనిపించారు. మళ్లీ ఆ తర్వాత నుంచి బాలయ్య - ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కనిపించలేదు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొహం, పెడమొహం గానే ఉంటున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.
నాడు ప్రచారం..
2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన చేసిన ప్రచారం గుర్తుండిపోయేలా ఉంది. కానీ ఆ తర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఆయన పేరు మాత్రం ఎప్పుడూ టీడీపీ చర్చల్లో వినిపిస్తూనే ఉంది. దాంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోదరి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఎంట్రీ అప్పుడే..?
ఇక రీసెంట్ గానే హరికృష్ణ వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సోదరి నందమూరి సుహాసిని.. ప్రస్తుతం తారక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పారు. ఈ కామెంట్స్ తో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. చూడాలి మరి ఎన్టీఆర్ ఈ కామెంట్స్ పట్ల ఎలా రియాక్ట్ అవుతారో అని.
ఇక ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications