ఘోర జలసమాధి: రెండు పడవలు బోల్తా పడి 500 మంది మృతి?
మయన్మార్ దేశానికి చెందిన మైనారిటీ వర్గమైన రోహింగ్యాల వలస ప్రయాణం బంగాళాఖాతంలో పెను విషాదాన్ని నింపింది. శరణార్థులతో వెళ్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో బోల్తాపడడంతో దాదాపు 500 మందికి పైగా మరణించి ఉంటారని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(UNHCR), అంతర్జాతీయ వలసల సంస్థ(IOM) సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జూన్ చివరి వారంలో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి ఈ రెండు పడవలు బయలుదేరాయి. ఈ రెండు పడవల్లో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది రోహింగ్యాలే కాకుండా బంగ్లాదేశ్‌లోని శరణార్థుల శిబిరాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదానికి గురైన రెండు పడవల్లో ఒకదానిలో దాదాపు 250 మంది ఉండగా.. బయలుదేరిన కొద్దిసేపటికే అది నియంత్రణ కోల్పోయి సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు 280 మందితో ప్రయాణిస్తున్న రెండో పడవ జులై 8వ తేదీన మయన్మార్‌లోని అయేయార్వాడి తీరంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. రెండు పడవల్లోనూ మొత్తం 530 మంది గల్లంతయ్యారు. వారు ప్రాణాలతో బయటపడే ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రెండు ఘోర పడవ ప్రమాదాల్లో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉన్నప్పటికీ.. ఇంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంపై అంతర్జాతీయ మానవతా సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళను కలిగిస్తున్నాయి.

రోహింగ్యా శరణార్థులు మెరుగైన జీవితం కోసం, హింస నుంచి తప్పించుకోవడానికి తరచుగా ప్రమాదకరమైన సముద్ర మార్గాలను ఆశ్రయిస్తుంటారు. జూన్, జూలై నెలల్లో వర్షాకాలంలో సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుంది. అధిక బరువుతో ఉన్న పడవల ప్రమాదాలు ఈ శరణార్థుల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ క్రమంలో సహాయ, రక్షణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని రద్దీగా ఉండే శరణార్థుల శిబిరాల్లో దాదాపు 12 లక్షల మంది రోహింగ్యాలు దిక్కుతోచని స్థితిలో బతుకులీడుస్తున్నారు. 2017లో మయన్మార్ సైన్యం జరిపిన హింసాకాండకు భయపడి వీరంతా అక్కడికి వలస వచ్చారు. మయన్మార్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వం కారణంగా వీరు తిరిగి సొంత దేశానికి వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు అమెరికా, ఇతర దాతృత్వ దేశాలు అంతర్జాతీయ సాయాన్ని భారీగా తగ్గించడంతో బంగ్లాదేశ్ శిబిరాల్లో వారికి లభించే రేషన్, ఆహార వసతులు దారుణంగా పడిపోయాయి.
ఐక్యరాజ్యసమితి ప్రకారం.. రోహింగ్యాలు ప్రయాణించే ఈ సముద్ర మార్గం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా మారింది. 2025లోనే సుమారు 6,500 మందికి పైగా రోహింగ్యాలు సముద్ర మార్గం ద్వారా పారిపోవడానికి ప్రయత్నించగా.. అందులో దాదాపు 900 మంది మరణించారు. రోహింగ్య సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడంలో అంతర్జాతీయ సమాజం విఫలమవుతోందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్(UNHCR), అంతర్జాతీయ వలసల సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More than 500 people are feared to have been aboard two boats that reportedly capsized off the coast of Myanmar.
— UNHCR, the UN Refugee Agency (@Refugees) July 16, 2026
Most were Rohingya passengers risking dangerous sea journeys in search of safety. We and IOM are deeply concerned by these reports and call for stronger efforts to… pic.twitter.com/FIvT4T4AfR












Click it and Unblock the Notifications