వెండితెర అందాల రాశిగా 'ధురంధర్' బ్యూటీ!
భారత సినిమా చరిత్రలో అత్యంత అందమైన నటిగా పేరుగాంచిన మధుబాల జీవిత కథను వెండితెరపైకి తెచ్చే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఈ బయోపిక్‌లో మధుబాల పాత్రను పోషించే లక్కీ ఛాన్స్ 'ధురంధర్' హీరోయిన్ సారా అర్జున్ దక్కించుకుంది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుండగా.. సారా అర్జున్ ఇప్పటికే మధుబాల పాత్ర కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో..
గతంలో ఈ పాత్ర కోసం కియారా అద్వానీ, సాయి పల్లవి వంటి అగ్రనాయికల పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు సారా అర్జున్‌నే ఖరారు చేశారు. ఈ సినిమాను అగ్ర నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తుండగా.. 'డార్లింగ్స్' ఫేమ్ జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ జులై 2026 నుంచి ప్రారంభం కానుంది. బడ్జెట్ సమస్యల కారణంగా ఇన్నేళ్లు ఆలస్యమైన ఈ ప్రాజెక్ట్.. భన్సాలీ చేతుల్లోకి రావడంతో మళ్లీ పట్టాలెక్కింది.

దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ పాత్రల కోసం అన్వేషణ
మధుబాల జీవితంలో కీలక వ్యక్తులైన దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ పాత్రల కోసం ప్రస్తుతం కాస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది. మధుబాల అందం, గ్రేస్, ఆమె కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సారా అర్జున్ తీవ్రంగా శ్రమిస్తోంది. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తున్న సారాకు.. 'ధురంధర్' సిరీస్ తెచ్చిపెట్టిన క్రేజ్ ఈ భారీ ఆఫర్ రావడానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మధుబాల సోదరి మద్దతుతో..
వాస్తవానికి మధుబాల బయోపిక్ చుట్టూ గతంలో అనేక వివాదాలు నెలకొన్నాయి. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఈ కథపై సినిమా తీయాలని భావించినా, మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుటుంబం అనుమతితోనే ఈ బయోపిక్ రూపొందాలని ఆమె స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం, సోనీ పిక్చర్స్, మధుర్ భూషణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధుబాల ప్రేమాయణాలు, వ్యక్తిగత జీవితంలోని విషాదాలు, ఆమె అకాల మరణం వంటి అంశాలను ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్ సారా అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications