వైఎస్ఆర్, చంద్రబాబు బయోపిక్ ఎలా ఉందంటే..?
దర్శకుడు దేవకట్టా, కిరణ్ జై కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'మయసభ' వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు రాజకీయాలను శాసించిన ఇద్దరు లెజెండరీ నాయకుల స్నేహాన్ని, ఆ తర్వాత వారు ప్రత్యర్థులుగా ఎలా మారారన్న కథాంశాన్ని అనధికారికంగా ఈ సిరీస్‌లో ఆవిష్కరించారు. ఈ ప్రయత్నం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
కథ:
ఈ సిరీస్ కాకర్ల కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి) మరియు ఎంఎస్ రామిరెడ్డి (చైతన్య రావు) అనే ఇద్దరు యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒకరు వ్యవసాయ సమస్యలపై పోరాడుతూ పై చదువుల కోసం ఆశపడితే, మరొకరు ఫ్యాక్షన్ గొడవలంటే విసుగెత్తి, రైతుల పట్ల సానుభూతితో ఉంటారు. వేర్వేరు భావజాలాలు ఉన్నా, దేశ రాజకీయాలను మార్చాలన్న ఒకే ఆకాంక్ష వీరిద్దరినీ స్నేహితులుగా మారుస్తుంది. ఈ సిరీస్ వీరి స్నేహ బంధం ఎలా మొదలైంది, రాజకీయాల్లోకి వీరి ప్రవేశం ఎలా జరిగింది, వారికి ఎదురైన అనుభవాలు ఏంటి అన్న విషయాలను ఆసక్తికరంగా చూపించింది. అయితే, వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారన్న కథను మాత్రం సీజన్ 2 కోసం దాచిపెట్టారు.

విశ్లేషణ:
దర్శకుడు దేవకట్టా ఈ సిరీస్‌లో రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల స్నేహం గురించి చాలామందికి తెలియని కోణాన్ని చూపించడం ప్రశంసనీయం. ఢిల్లీలో తెలుగు రాజకీయ నాయకులకు ఎదురైన అవమానాలు, అప్పటి రాజకీయ పరిస్థితులు, పదవుల కోసం నాయకులు ఎలా బానిసత్వం చేశారనే సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు.

అయితే, కొన్ని అంశాలు కథకు బ్రేకర్లుగా అనిపిస్తాయి. ముఖ్యంగా, మధ్యలో వచ్చే ప్రేమకథలు, రాయలసీమ ఫ్యాక్షన్, బెజవాడ రౌడీయిజం ట్రాక్‌లు కథతో అంతగా సింక్ కాలేదు. కానీ, సాయి కుమార్ పోషించిన ఎన్టీఆర్ పాత్ర (ఆర్సీఆర్), దివ్య దత్తా పోషించిన ఇందిరా గాంధీ పాత్ర (ఐరావతి) సిరీస్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఐరావతి పాత్రలో దివ్య దత్తా నటన అద్భుతం. అలాగే, ఆది పినిశెట్టి, చైతన్య రావు తమ పాత్రల్లో లీనమై నటించారు. వారి బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్పులు ఆకట్టుకుంటాయి. మొత్తంగా, ఈ సిరీస్ ఒక మంచి ప్రయత్నంగా నిలుస్తుంది, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని కచ్చితంగా ఆకట్టుకుంటుంది.












Click it and Unblock the Notifications