మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటీమణి, సామాజిక వేత్త "దివ్యవాణి చౌదరి" ముఖ్య వేడుకకు శ్రీకారం చుట్టారు. "బాపు బొమ్మ - విశ్వ మహిళ" 2026 పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సమాజంలో వివిధ రంగాల్లో రాణిస్తూ, తమదైన ముద్ర వేస్తున్న మహిళామణులను గౌరవించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకప్పుడు బాపు సినిమాల్లో 'బాపు బొమ్మ'గా తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న దివ్యవాణి.. ఈ తరహా రీతిలో ముందడుగు వేయడం మంచి పరిణామమని కితాబు ఇస్తున్నారు.
అవార్డు గ్రహీతలు ఎవరంటే..
ఈ వేడుకలో పలువురు దిగ్గజ మహిళలు పురస్కారాలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి కొణిదెల అంజనా దేవితో ఈ పురస్కారాల ప్రదానాన్ని శ్రీకారం చుట్టడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. ప్రముఖ యాంకర్ స్వప్న, సామాజిక కార్యకర్త డాక్టర్ వెన్నెల గద్దర్, గాయని సమీరా భరద్వాజ్, అమెరికా నుంచి విచ్చేసిన డి. జ్యోతిరెడ్డి, జనేతా కంచర్ల వంటి ప్రముఖులు ఈ అవార్డులను స్వీకరించిన వారిలో ఉన్నారు.

వైభవంగా సాగిన వేడుక..
తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, నటుడు హర్షవర్ధన్ తదితరులు అతిథులుగా విచ్చేసి దివ్యవాణి చేస్తున్న సామాజిక కృషిని కొనియాడారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతిభావంతులైన మహిళలను గుర్తించి సన్మానించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.
దివ్యవాణి 'వజ్ర సంకల్పం'..
సమాజంలోని సాటి మహిళల్లో స్ఫూర్తిని రగిలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దివ్యవాణి తెలిపారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా తన వంతు ప్రయత్నంగా ఈ అవార్డులను రూపొందించానని ఆమె స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్త విస్తరణకు సన్నాహాలు..
ఈ పురస్కారాల వేడుకను కేవలం హైదరాబాద్‌కో లేదా తెలుగు రాష్ట్రాలకో పరిమితం చేయకూడదని దివ్యవాణి సంకల్పించారు. భవిష్యత్తులో "బాపు బొమ్మ - విశ్వ మహిళ" అవార్డులను దేశవ్యాప్తంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళల ప్రతిభను వెలికితీసి, వారిని గౌరవించడమే తన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications