సస్పెన్స్, థ్రిల్స్‌తో అదరగొట్టిన కొత్త సినిమా.. ప్రేక్షకులను కట్టిపడేస్తున్న క్రైమ్ థ్రిల్లర్..!
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన తారాగణంగా వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'మిస్సింగ్ మేఘన'. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తేదీకి ముందే వేసిన ప్రీమియర్స్ తోనే సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చి, బాక్సాఫీస్ వద్ద చక్కటి ప్రేక్షకులను రాబట్టుకుంటోంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథేంటి, సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథేంటంటే?
బేకరీ నడుపుకునే మేఘన (అమ్ము అభిరామి) రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి శ్రీనివాసరావు (గోపరాజు రమణ) ఆందోళన చెంది పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తాడు. పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో, మేఘనకు కాబోయే భర్త, ఏసీపీ అయిన అర్జున్ (కౌశిక్)ను కలిసి సహాయం కోరతాడు. రంగంలోకి దిగిన అర్జున్ విచారణ వేగవంతం చేస్తాడు. ఈ క్రమంలో మేఘనని చివరగా కార్తీక్ (రామ్ కార్తీక్) అనే బైక్ రైడర్ డ్రాప్ చేసినట్లు తెలుస్తుంది.

అతన్ని విచారించగా.. తనకు మేఘన ఎవరో తెలియదని, ఆద్య (వైదిక సెంజాలియా)తో తన బ్రేకప్ స్టోరీని చెబుతాడు. అయితే, మేఘన కాల్ లిస్ట్ పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయి. రైడర్ కార్తీక్‌తోనే మేఘన ఎక్కువగా మాట్లాడినట్లు తేలుతుంది. అసలు కార్తీక్‌కు మేఘనకు ఉన్న సంబంధం ఏంటి? కార్తీక్ - ఆద్య ప్రేమకథ వెనుక అసలు నిజం ఏంటి? మేఘన మిస్సింగ్ వెనుక ఎవరున్నారు? చివరికి ఆమె ఆచూకీ దొరికిందా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే 'మిస్సింగ్ మేఘన' కథ
విశ్లేషణ
'మిస్సింగ్ మేఘన' అనే టైటిల్‌తోనే మేకర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. అనుకున్నట్లుగానే సినిమాను అద్యంతం ఉత్కంఠభరితంగా మలిచారు. ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ సీన్‌లోనే మేఘన మిస్సింగ్ తో కథలోకి తీసుకెళ్లి, పోలీసుల విచారణతో సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో కార్తీక్‌తో మేఘన రోజూ మాట్లాడుతుందనే నిజం బయటపడటం, వీళ్లిద్దరూ లవర్స్ అనే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలను పెంచుతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో కేవలం మిస్సింగ్ కేసుగానే కాకుండా మర్డర్స్, డ్రగ్స్ మాఫియా వంటి మలుపులతో కథ పరుగులు పెడుతుంది. వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు, హీరో విలన్‌ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సినిమాను మరింత రక్తికట్టిస్తాయి. క్లైమాక్స్ లో హీరో తన ప్రియురాలను కాపాడుకునే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మంచి యాక్షన్ ట్రీట్‌ను ఇస్తుంది. నటీనటుల అభినయం, దర్శకుడు నడిపించిన సస్పెన్స్ డ్రామా సినిమాను నిలబెట్టాయి.
నటీనటుల పనితీరు
మేఘన పాత్రలో అమ్ము అభిరామి చాలా క్యూట్‌గా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకున్నారు.అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్‌గా కౌశిక్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లవ్ ఫెయిల్యూర్ యువకుడిగా, యాక్షన్ మోడ్‌లో రామ్ కార్తీక్ అద్భుతంగా నటించి మెప్పించారు. అంకిత్ కొయ్య, గోపరాజు రమణ తమ పరిధి మేరకు చక్కటి నటనతో అలరించారు. సాంకేతికంగా సినిమా రిచ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కథకు తగినట్టుగా ఉత్కంఠను పెంచాయి. నేపధ్య సంగీతం పాటలు సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓ అమ్మాయి కిడ్నాప్, ఊహించని మలుపులు, లవ్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో సాగే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకుంటే 'మిస్సింగ్ మేఘన' పర్ఫెక్ట్ ఛాయిస్.
రేటింగ్: 3/5














Click it and Unblock the Notifications
